Sister Abhaya Case: దేవుడిని చాలామంది నమ్ముతారు. కానీ కొంతమంది ఆ నమ్మకాన్ని అమ్ముకుంటారు. ఆ నమ్మకం మాటున దారుణాలకు పాల్పడుతుంటారు. ఘోరాలకు ఒడిగడుతుంటారు. అర్థ బలం, అంగ బలంతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. కాని చివరికి ఏదో ఒక రోజు దేవుడు కచ్చితంగా వారిని శిక్షిస్తాడు. వారి పాపాన్ని పండేలా చేస్తాడు. అటువంటిదే ఈ సంఘటన కూడా. దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన సృష్టించిన పరిణామాలు అన్నీ ఇన్నీ కావు.
అది కేరళ రాష్ట్రం.. 1992 సంవత్సరం. అక్కడి కొట్టాయం ప్రాంతంలోని కాథలిక్ చర్చిలో ఏటి సంవత్సరాల సిస్టర్ అభయ (సన్యాసిని) చదువుకుంటున్నది. 1992, మార్చి 27న ఆమె వార్షిక పరీక్షలలో భాగంగా చదువుకోడానికి తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్ర లేచింది. దాహంగా ఉండడంతో నీరు తాగడానికి ఆ కాన్వెంట్ లో ఉన్న వంటగదిలోకి వెళ్ళింది. అలా ఆమె గదిలోకి ప్రవేశించగా ఘోరాన్ని చూసింది.
ఆ వంట గదిలో చర్చి ఫాదర్ లు థామస్ కొటూర్, జోస్ పోరకాయితిల్ కాన్వెంట్ వార్డెన్, క్యాథలిక్ సన్యాసి సిస్టర్ సెఫీ తో అత్యంత దారుణమైన వ్యవహారం సాగిస్తున్నారు. పైగా వారు విదేశాల నుంచి దిగుమతి అయిన మద్యం తాగారు. విపరీతమైన మత్తులో ఉన్నారు. ఆ పరిణామాన్ని చూసిన అభయ ఒక్కసారిగా ఆందోళన చెందింది. ఆ ముగ్గురు ఆమెను చూశారు. దెబ్బకు వారికి మత్తు వదిలింది. తమ వ్యవహారాన్ని ఆమె బయట పడుతుందని భయపడ్డారు. అంతేకాదు సెఫీ ఒకసారిగా రోకలి బండతో అభయను కొట్టింది. ఫాదర్ కొటూర్ ఆమె గొంతును పిసికి చంపేశాడు. ఆ తర్వాత అభయ మృతదేహాన్ని ఆ కాన్వెంట్ లో ఉన్న బావిలో పడేశారు. ఆ తర్వాత అభయ తప్పిపోయిందని ఆ ముగ్గురు ప్రచారం చేశారు. కొద్దిరోజుల తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుని, బావిలో పడిందని చెప్పారు.
పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటనా స్థలానికి వచ్చారు. అభయ మృతదేహాన్ని బయటకి తీశారు. ప్రాథమిక నివేదికలో అభయ హత్యకు గురైందని తెలిసింది. కానీ ఆ చర్చి నిర్వాహకులు అత్యంత శక్తివంతమైన వ్యక్తులు. అందువల్లే ప్రతి ఒక్కరి మీద ఒత్తిడి తీసుకురాగలిగారు. అంతేకాదు కేసును మూయించగలిగారు. ఇదే క్రమంలో సెఫీ తన అంతర్గత అవయవాలకు శస్త్ర చికిత్స చేయించుకుంది. తాను ఆ ఇద్దరి ఫాదర్ లతో ఎటువంటి అంతర్గత కార్యకలాపాలకు పాల్పడలేదన్నట్టుగా నమ్మించడానికి ఆమె ఆ ప్రయత్నం చేసింది.
ఆ ఇద్దరు ఫాదర్లు ఆర్థికంగా శక్తివంతులు కావడంతో ఆ ఘటనకు సంబంధించిన సాక్షాలను చెరిపి వేయడానికి అనేక రకాలుగా ప్రయత్నించారు. కాన్వెంట్ మొత్తాన్ని పునర్నిర్మించారు. హాస్టల్ కు దూరంగా వంటగదిని నిర్మించారు. ఆ బావిని మరింత లోతు చేసి, విశాలవంతంగా మార్చారు. దాదాపు 16 సంవత్సరాల పాటు ఈ కేసు విషయంలో సిబిఐ విచారణ చేసింది. దాదాపు మూడుసార్లు ఈ కేసును ఆత్మహత్య అని మూసివేసింది. అభయ నిత్యం నిరాశతో ఉండేదని.. అందువల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని సిబిఐ పేర్కొంది.
ఇదే క్రమంలో ఈ కేసును విచారిస్తున్న థామస్ వర్గీస్ అనే పోలీస్ అధికారి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అంతేకాదు ఈ కేసును మూసివేయమని సిబిఐ నుంచి తనకు విపరీతమైన ఒత్తిడి వస్తోందని, కాథలిక్ చర్చి, ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కైన విధానాన్ని అతడు బయట పెట్టాడు.
ఇదే క్రమంలో సిస్టర్ అభయకు న్యాయం చేయాలని ఇదే ప్రాంతానికి చెందిన జోమెన్ పుటెన్ పురకల్ ఆందోళన చేస్తున్నాడు. అతడికి థామస్ జత కావడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. అయితే ఇక్కడే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అభయను వారు ముగ్గురు చంపుతున్నప్పుడు అదక్క రాజు అనే ఓ దొంగ చూశాడు. ఎందుకంటే ఆ రోజు కాన్వెంట్లో దొంగతనం చేయడానికి అతడు అక్కడికి వెళ్ళాడు.. రాజు మీద ఎన్నో రకాల ఒత్తిళ్ళు వచ్చాయి. చాలామంది ప్రలోభాలకు కూడా గురి చేశారు.. కానీ అతడు దొంగ అయినప్పటికీ మాటమీద నిలబడ్డాడు. ఆరోజు చూసింది మొత్తం చెప్పాడు.. ఫలితంగా సెఫీ, ఆ ఇద్దరు ఫాదర్ లను 2008లో పోలీసులు అరెస్ట్ చేశారు.
వాస్తవానికి దేవుడు మనం చేసేది మొత్తం చూస్తూనే ఉంటాడు. దేవుడి సేవలో ఉంటూ, అక్రమాలు చేసినంతమాత్రాన ఉపేక్షించడు. సిస్టర్ అభయ కేసులో దేవుడు ఏం జరుగుతుందో చూద్దామని కొద్ది రోజులు కాలయాపన చేశాడు. కానీ చివరికి న్యాయం గెలిచేలా చేశాడు. నీ వలె పొరుగు వారిని ప్రేమించమని చెప్పే ఏసుక్రీస్తు.. పొరుగువారిని చంపితే ఎలా ఊరుకుంటాడు!