Crime News : ఇద్దరి కోసం.. ఏడు పోలీసు బృందాలు గాలించాయి.. 500 కెమెరాలను జల్లెడ పట్టాయి.. ఇంతటి ఆపరేషన్ ఎందుకు జరిగిందంటే?

ఏడు ప్రత్యేక పోలీసు బృందాలు తనిఖీ చేయని ప్రాంతం అంటూ లేదు. ఇందుకోసం ఏకంగా 500 కెమెరాలను జల్లెడ పట్టారు. కనిపించిన ప్రతి వ్యక్తిని ప్రశ్నించారు. అనుమానం ఉన్నచోట పదేపదే తనిఖీ చేశారు. సోషల్ మీడియాను వినియోగించుకున్నారు. ప్రధాన మీడియాలో ప్రకటనలు ఇచ్చారు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 8, 2024 6:41 pm

Delhi

Follow us on

Crime News :  ఢిల్లీ మహానగరంలో పోలీసులు చేసిన ఆపరేషన్ కలకలం సృష్టించింది. అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో పోలీసులు అత్యంత కట్టుదిట్టంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. పోలీసులు ఏడు బృందాలుగా విడిపోయి విస్తృతంగా తనిఖీలు చేశారు. పోలీసులు చేస్తున్న ఆ హడావిడి చూసి చాలామంది భయపడ్డారు. కరుడుగట్టిన తీవ్రవాదుల కోసమో, గ్యాంగ్ స్టర్ ల కోసమో ఆపరేషన్ చేపడుతున్నారేమో అనుకున్నారు. కానీ తీరా అసలు విషయం తెలిసిన తర్వాత నోరెళ్ల బెట్టారు.

అసలు విషయం ఇదీ

ఢిల్లీలోని నోయిడాలో ఓ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవల ఆ పాఠశాల యాజమాన్యం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో ఆ ఇద్దరు విద్యార్థులు ఫెయిలయ్యారు. పాఠశాల యాజమాన్యం అందించిన ప్రోగ్రెస్ కార్డును తమ తల్లిదండ్రులకు చూపించి.. మరుసటి రోజు తల్లిదండ్రులను కూడా తీసుకురావాలని ఉపాధ్యాయులు చెప్పారు. తమకు వచ్చిన ఆ ఫలితాలు చూపిస్తే తల్లిదండ్రులు కొడతారని, తిడతారని భయపడి.. ఆ విద్యార్థులు ఇంటికి వెళ్లకుండా బయటనే ఉండిపోయారు. అదే తమ పిల్లలు ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆ విద్యార్థులు స్కూల్లో కూడా లేకపోవడంతో పలుచోట్ల వెతికారు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

ఎక్కడికి వెళ్లారో తెలుసుకునేందుకు..

పాఠశాల నుంచి విద్యార్థులు ఎక్కడికి వెళ్లారో తెలుసుకునేందుకు ఆ ప్రాంతంలోని 500 సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. చివరికి వారి ఆచూకీ లభించింది. పాఠశాల నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ప్రాంతంలో ఆ విద్యార్థులు ఉన్నారు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి వెళ్లి ఆ ఇద్దరు విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.” మార్కులు ప్రతిభకు కొలమానం కాదు. మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు. విద్యార్థులను భయపెట్టి బోధన సాగించొద్దు. వారికి అర్థమయ్యేలా చెప్పాలి. వారిలో భయాన్ని పోగొట్టాలని” పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ” విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వినాలి. పరీక్షలలో వాటికి సరైన సమాధానాలు రాయాలి. అప్పుడే మెరుగైన మార్కులు వస్తాయి. మార్కులు రాలేదని భయం వద్దు. అర్థం కాని పాఠాలను మళ్లీమళ్లీ చెప్పించుకోవాలి. అప్పుడే విద్యార్థి సన్మార్గంలో పయనిస్తారు. బంగారు భవిష్యత్తుకు దారులు వేసుకుంటారని” పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లారు. ఆ ఇద్దరు విద్యార్థుల ఆచూకీ తెలుసుకునేందుకు ఢిల్లీ పోలీసులు చేసిన ప్రయత్నాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు.