Telangana HYDRA : హైడ్రాకు కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ కొనసాగుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులను, నాలాలను, కుంటలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ క్రమంలో అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి రంగనాథ్ ఒక కీలక ప్రకటన చేశారు. ” ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ లోని భవనాలు, అందులో ఎవరైనా నివాసం ఉంటే వాటిని తాత్కాలికంగా ముట్టుకోము. నిర్మాణ దశలో ఉంటేనే వాటిని పడగొడతాం. హైదరాబాద్ నగర పరిధిలోని మల్లంపేట చెరువులో భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. వాటిని మాత్రమే కూల్చివేశాం. ఆ చెరువు బఫర్ జోన్ ప్రాంతంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇళ్ళు నిర్మిస్తున్నారు. వాణిజ్య భవనాలను నిర్మిస్తున్నారు. సున్నం చెరువులో కొన్ని షెడ్లు నిర్మించి.. వాటిని సమస్యలుగా ఉపయోగిస్తున్నారు. గతంలో వీటిని అప్పటి అధికారులు కూలగొట్టారు. అయితే ఇప్పుడు కూడా నిర్మాణాలు చేపడుతున్నారు. అందువల్ల వాటిని పడగొడుతున్నాం. ఆ నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసులు పెట్టాం. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసాని భూపాల్ రెడ్డి పై కూడా క్రిమినల్ కేసులో నమోదు చేశాం. ఆక్రమణలో ఉన్న ఏ ఇంటినీ పడగొట్టం. కేవలం ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ లో ఉన్న ఉన్న స్థలాలను ఎవరూ కొనుగోలు చేయొద్దు. ఇళ్లను కూడా కొనొద్దని” రంగనాథ్ ప్రకటించారు.
బ్రేక్ ఇచ్చినట్టే.. ఇచ్చి..
ఇటీవల వర్షాలకు హైడ్రా కూల్చివేతలకు కొంత సమయం వరకు బ్రేక్ ఇచ్చింది. ఆదివారం నుంచి మళ్లీ తన పని మొదలుపెట్టింది. పేరుపొందిన ప్రజా ప్రతినిధులు నిర్మించిన అక్రమ నిర్మాణాలను పడగొట్టింది.. ఓ బడా నిర్మాతకు కూడా నోటీసు అందించింది.. ఓ మాజీ ఎమ్మెల్యే చెందిన నిర్మాణాన్ని కూల్చింది. అంతేకాకుండా అమీన్ పూర్, హిమాయత్ సాగర్, గండిపేట చెరువుల పరిధిలో అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించింది. ఆ నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు జారీ చేసింది. త్వరలో ఈ నిర్మాణాలు కూడా పడగొట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.. కబ్జాలు లేని చెరువులను, కుంటలను, నాలాలను చూడాలనేదే తన లక్ష్యమని ఇటీవల రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన చేసిన ప్రకటనకు అనుగుణంగానే హైడ్రా పని చేస్తోందని రంగనాథ్ అంటున్నారు. ” చెరువులను సంరక్షించేందుకు హైడ్రా ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాం. అక్రమాలను పడగొట్టడమే ప్రధాన ధ్యేయంగా హైడ్రా ముందుకు వెళుతుంది. దీనిపై ఎలాంటి విమర్శలు వచ్చినా న్యాయపరంగా మేం చూసుకుంటాం. ఎవరు కూడా చెరువులను ఆక్రమించొద్దని” రంగనాథ్ అన్నారు.