https://oktelugu.com/

West Bengal : కోల్ కతా ట్రైనీ వైద్యురాలి ఘటన మర్చిపోకముందే.. పశ్చిమ బెంగాల్లో మరో దారుణం..

కోల్ కతా లో ఆర్జీ కార్ ఆసుపత్రిలో ఇటీవల ట్రైనీ వైద్యురాలు హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఇప్పటికీ ఈ కేసు కు సంబంధించి విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసు నేపథ్యంలో మమత బెనర్జీ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 5, 2024 / 09:50 PM IST

    West Bengal

    Follow us on

    West Bengal : ట్రైనీ వైద్యురాలి ఉదంతం మర్చిపోకముందే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది.. దీంతో ఆ రాష్ట్రంలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి.. జాతీయ మీడియాలో ప్రసారమవుతున్న వార్తల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దక్షిణ 24 పరగణాల జిల్లాలో మహిషా మారి అనే గ్రామానికి చెందిన 11 సంవత్సరాల బాలిక స్థానికంగా ఉన్న పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో ఆమె ట్యూషన్ వెళ్ళింది. ఆరోజు ఇంటికి రాలేదు. ఆ మరుసటి రోజు డ్రైనేజీ కాలువలో విగత జీవిగా పడి ఉంది. దీంతో ఆ గ్రామస్తులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు.. ఆ బాలిక గత శుక్రవారం ట్యూషన్ వెళ్ళింది. ఆమె ఇంటికి తిరిగి వస్తుండగా అదృశ్యమైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోవడంతో మహిషా మారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే అక్కడి పోలీసులు జయనగర్ పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయాలని ఆ బాలిక కుటుంబ సభ్యులకు చెప్పారు.. దీంతో వారు చెప్పినట్టుగానే అదే పని చేశారు.. ఈ లోగానే శనివారం తెల్లవారుజామున ఆ బాలిక మృతదేహం స్థానికంగా ఉన్న డ్రైనేజీ కాలువల కనిపించింది..

    ఆగ్రహం కట్టలు తెంచుకుంది

    తమ కుమార్తె అలా విగత జీవిగా పడి ఉండడంతో ఆమె కుటుంబ సభ్యుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గ్రామస్తులు కూడా ఈ ఘటనపై తీవ్రంగా కలత చెందారు. అయితే ఆమెపై అత్యాచారానికి పాల్పడి.. ఆ తర్వాత హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అనుమానిస్తున్నారు. దీంతో వారు పట్టరాని ఆగ్రహంతో రగిలిపోయి పోలీసుల తీరుపై మండిపడ్డారు. మహిషా మారి పోలీస్ క్యాంప్ పై దాడి చేశారు. పోలీసులను దారుణంగా కొట్టారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తరిమి తరిమికొట్టారు. పరిస్థితి అద్భుతపడంతో అదనపు పోలీసు బలగాలను ఆ రాష్ట్ర హోంశాఖ రప్పించింది. గ్రామంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చింది.. అయితే ఆ బాలికను అపహరించడం, ఆపై హత్యాచారం చేయడంతో.. పోలీసులు ఈ కేసును సవాల్ గా తీసుకున్నారు. వారికి లభించిన ఆధారాల ప్రకారం 19 సంవత్సరాల ముస్తాకిన్ సర్దార్ అనే యువకుడిని అరెస్టు చేశారు.. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దుర్గామాత పూజలు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రం మొత్తం సందడి వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఘటన జరగడం బాధాకరమని భారతీయ జనతా పార్టీ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పుతున్నాయని.. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని.. ఇదంతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్లక్ష్యమని బిజెపి నాయకులు మండిపడుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో అమిత్ మాలవియా అనే బిజెపి నాయకుడు ట్విట్టర్ ఎక్స్ లో ఫోటోలు, వీడియో షేర్ చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్డారు.