ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. పలు దేశాల్లో కరోనా తగ్గుముఖం పడుతుండగా థర్డ్ వేవ్ గురించి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. థర్డ్ వేవ్ లో పిల్లలపై కరోనా వైరస్ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇతర వేరియంట్లతో పోలిస్తే డెల్టా వేరియంట్ మరింత వేగంగా వ్యాపిస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది.
చాలామంది ప్రజలు కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కు భయపడి కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. కరోనా వ్యాక్సిన్ తీసుకునే వాళ్లను పలు దేశాలు వెరైటీ బహుమతులను ఇస్తుండటం గమనార్హం. అయినప్పటికీ కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారి విషయంలో కొన్ని దేశాలు కఠినంగా వ్యవహరించడానికి సిద్ధమయ్యాయి. ఫిజి ప్రధాని ఫ్రాంక్ బైనిమారామా నో జాబ్ నో జాబ్ అంటూ వ్యాక్సిన్ తీసుకోని వారి విషయంలో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారికి ఉద్యోగం పోయినట్టేనని హెచ్చరించారు. ఆగస్టు 15 నాటికి ఫస్ట్ డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకోని వాళ్లు సెలవులపై వెళ్లాల్సి ఉంటుందని ప్రధాని స్పష్టం చేయడంతో పాటు నవంబర్ నాటికి సెకండ్ డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని వెల్లడించారు. ఫిజిలో ఇప్పటివరకు కేవలం 3.40 లక్షల మంది జనం మాత్రమే వ్యాక్సిన్లు తీసుకున్నారు.
ఫిజి దేశ జనాభా 9.30 లక్షలు కావడం గమనార్హం. టీకాలు తీసుకోలేదన్న కారణంతో ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై ఆ దేశ ఉద్యోగుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని నియంతృత్వ పోకడ అని కొంతమంది ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.