జూలై 1వ తేదీన పడాల్సిన జీతాలు అవీ.. 10వతేదీ వచ్చింది.. అయినా పడలేదు. ఇంకా ఎప్పుడు వస్తాయో క్లారిటీలేదు.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, పించన్లు విడతలు వారీగా పడుతూనే ఉన్నాయి. ఇంకా చాలా మందికి పడాల్సి ఉంది. ఎప్పుడు పడుతాయన్నది ఏపీ ఆర్థిక శాఖ చెప్పడం లేదు.
ఇక ఇప్పటికీ తమకు జీతాలు రాలేదని పలువురు ఉద్యోగులు, పింఛనర్లు గోడు వెళ్లబోసుకుంటున్నారు. అడిగితే అధికారులు సమాధానం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 4.70 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.20 లక్షల మంది ఉపాధ్యాయులు, మరో 4 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరికి గతంలో జీతాలు, పింఛన్ల చెల్లింపులో జాప్యం జరిగిన దాఖలాలు చాలా తక్కువ.
ఇదివరకు అందరికీ జీతాలు 1వ తారీఖునే పడేవి. ఆదివారం, శనివారం వస్తే మర్నాడు వేసేవారు. ఇప్పుడు ఏకంగా 10వ తేదీ వచ్చినా అందరికీ వేతనాలు, పింఛన్లు రాకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఏపీ ఆర్థిక పరిస్థితికి నిదర్శనం ఏంటంటే.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఒక అధికారి ఖాతాలో శుక్రవారం సాయంత్రానికి కూడా పెన్షన్ డబ్బు జమ కాలేదట.. శుక్రవారం రాత్రిపడిందని ఆయన చెబుతున్నారు..
ఏపీ ఆర్థిక పరిస్థితి కరోనా కల్లోలంలో అతలాకుతలం అయ్యింది. కనీసం జీతాలు కూడా చెల్లించలేని స్థితికి చేరింది. అందుకే ఈ పరిస్థితి దాపురించినట్టు తెలిసింది. ఇప్పటికే ఆర్బీఐ సహా దొరికిన చోటల్లా జగన్ ప్రభుత్వం అప్పులు చేస్తూనే ఉంది. అవి శృతి మించినట్టు తెలిసింది.