
భారత్ లో కరోనా మహమ్మారి అడ్డూఅదుపు లేకుండా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు కరోనా వైరస్ మనుషుల నుంచి మనుషులకు మాత్రమే వ్యాప్తి చెందుతుందని తెలుసు. అయితే జంతువులకు సైతం కరోనా సోకుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికా వెటర్నరీ వైద్యులు కరోనా వైరస్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.
అమెరికాలో పది వేల మింక్స్ కరోనా వైరస్ బారిన పడి చనిపోవడం గమనార్హం. మనుషుల నుంచే వీటికి కరోనా సోకి ఉండవచ్చని వెటర్నరీ వైద్యులు భావిస్తున్నారు. అమెరికాలో బొచ్చు కోసం మింక్స్ ను ఎక్కువగా పెంచుతారు. అమెరికాలోని ఉటా ఫార్మ్స్ లో 8 వేల మింక్స్, విస్కాన్సిన్‌లో 2 వేల మింక్స్ కరోనా వైరస్ బారిన పడి చనిపోయాయి. ఉటా పశువైద్యాధికారి డాక్టర్ డీన్ టేలర్ మాట్లాడుతూ ఈ జంతువుల ఫారాల్లో పని చేసే సిబ్బందికి జులైలో కరోనా సోకిందని తెలిపారు.
ఆగష్టు నెలలో ఫారాల్లో పెరిగే మింక్స్ కు కరోనా నిర్ధారణ కావడంతో మనుషుల నుంచి జంతువులకు కరోనా సోకుతుందని తేలిందని వెల్లడించారు. ఈ దిశగా మరిన్ని పరిశోధనలు చేస్తున్నామని జంతువులకు వైరస్ ఎలా సోకిందో తెలియాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల మనుషులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. జంతువులకు కూడా కరోనా సోకితే జీవుల మనుగడే ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉంది.
అమెరికా నేషనల్ వెటర్నరీ సర్వీసెస్ లాబొరేటరీస్ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. మింక్స్ తో పాటు పిల్లులు, కుక్కలు, పులులు, సింహాలకు కూడా కరోనా నిర్ధారణ అయినట్లు సమాచారం. అయితే మనుషుల నుంచి వైరస్ జంతువులకు వ్యాపిస్తుండగా జంతువుల నుంచి మనుషులకు వైరస్ వ్యాపిస్తుందో లేదో తెలియాల్సి ఉంది. మరోవైపు కరోనా గురించి వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ప్రజల్లో కరోనాపై భయాందోళనను మరింత పెంచేలా ఉండటం గమనార్హం.