ప్రపంచ దేశాలను చిగురుటాకులా వణికిస్తున్న కరోనా మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాపై సైతం పంజా విసిరిన సంగతి తెలిసిందే. అమెరికాలో ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. అయితే తాజాగా అమెరికా కరోనా పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాలను సడలించింది. అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలనా కేంద్రం(సీడీసీ) తాజాగా మార్గదర్శకాల్లో లక్షణాలు లేకపోతే కరోనా నిర్ధారణ పరీక్షలు అవసరం లేదని పేర్కొంది.
కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తులకు ఆరడుగుల లోపు 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉంటే మాత్రమే పరీక్షల కోసం వెళ్లాలని సూచనలు చేసింది. అయితే అమెరికా సీడీసీ సవరించిన మార్గదర్శకాలను అక్కడి మెజారిటీ రాష్ట్రాలు వ్యతిరేకించడం గమనార్హం. 30కు పైగా రాష్ట్రాలు వైరస్ సోకిన వారితో సన్నిహితంగా మెలిగిన వారు, కరోనా లక్షణాలు కనిపించిన వారు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచనలు చేస్తున్నాయి.
సీడిసీ సవరించిన మార్గదర్శకాలను పట్టించుకోకుండానే పరీక్షలు చేయడానికి రాష్ట్రాలు మొగ్గు చూపుతున్నాయి. గతంలో సీడీసీ కరోనా లక్షణాలు ఉన్నవారితో పాటు లక్షణాలు లేని వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని పేర్కొంది. లక్షణాలు లేని వారు సైతం వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని నివేదికలు చెబుతున్నాయని తెలిపింది. అయితే తాజా మార్గదర్శకాల్లో మాత్రం సీడీసీ లక్షణాలు లేని వారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని చెప్పడం గమనార్హం.