
గత కొన్ని రోజుల నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న మందు గురించి జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఆయుర్వేద మందును తీసుకున్న వాళ్లంతా మందు గురించి పాజిటివ్ గా చెబుతుండటం గమనార్హం. ఈరోజు నుంచి ఆయుర్వేద మందు పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాగా జనాలు కృష్ణపట్నానికి పోటెత్తారు. ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నవాళ్లు సైతం తమ ఆరోగ్యం మందు వల్ల బాగైందని చెబుతున్నారు.
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ సైతం మందు పంపిణీకి సుముఖత వ్యక్తం చేసింది. కృష్ణపట్నం మందు వేసుకున్న ఓ రిటైర్డ్ మాస్టారు మీడియాతో మాట్లాడుతూ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత తనకు ఊపిరి అందడం లేదని మరో రెండు నిమిషాలు ఆగితే చనిపోతానని అనుకున్నానని చెప్పారు. ఆ సమయంలో మా వాళ్లు వచ్చి కంటిలో మందు వేశారని ఆ మందు వేసుకున్న 10 నిమిషాల్లో తాను కరోనా నుంచి కోలుకున్నానని రిటైర్డ్ మాస్టర్ చెప్పుకొచ్చారు.
రిటైర్డ్ మాస్టర్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా ఈ విషయం తెలిసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాకు కృష్ణపట్నంలో ఉచితంగా మందు పంపిణీ జరుగుతుండటం గమనార్హం. ఆనందయ్య ఆయుర్వేదంపై పూర్తిస్థాయిలో పట్టు ఉండటంతో ఈ మందును కనిపెట్టినట్టు తెలుస్తోంది. మందుపై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు.
ఇతర జిల్లాల నుంచి మందు కోసం ప్రజలు కృష్ణపట్నానికి క్యూ కడుతుండటం గమనార్హం. సీఎం జగన్ ఈ మందు శాస్త్రీయత, పని చేసే విధానంపై అధ్యయనం చేయించాలని అధికారులను ఆదేశించారు