
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పన్ను చెల్లింపుదారులకు వరుస శుభవార్తలు చెబుతోంది. పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరేలా కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైంది. పన్ను చెల్లింపుదారుల కొరకు కొత్త ఇఫైలింగ్ వెబ్ పోర్టల్ అందుబాటులోకి రానుంది. ట్యాక్స్ పేయర్స్ ఈ వెబ్ సైట్ ద్వారా సులభంగా ఐటీఆర్ ను దాఖలు చేయవచ్చు.
ఈ వెబ్ సైట్ సహాయంతో ఇతర ట్యాక్స్ సంబంధిత పనులను కూడా సులభంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ జూన్ నెల 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ప్రస్తుతం పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉన్న పోర్టల్ పని చేయదని పాత సిస్టమ్ నుంచి కొత్త సిస్టమ్ కు బదిలీ జరుగుతుండటంతో పోర్టల్ పని చేయదని వెల్లడించింది. www.incometaxindiaefiling.gov.in నుంచి www.incometaxgov.in బదిలి జరుగుతోంది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరేలా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ గడువును పొడిగించడం గమనార్హం. ఇప్పటికే పలుమార్లు గడువును పొడిగించిన కేంద్రం కరోనా తీవ్రత దృష్ట్యా మరోసారి గడువును పొడిగించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల 2021 సెప్టెంబర్ 30 వరకు ఐటీఆర్ దాఖలు చేసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నుంచి ఈ మేరకు కీలక ప్రకటన వెలువడింది. రివైజ్డ్ లేదా ఆలస్యమైన ఐటీఆర్ దాఖలుకు గడువు 2021 డిసెంబర్ 31 వరకు ఉండగా సీబీడీటీ ఆ గడువును 2022 జనవరి 31కు పొడిగించడం గమనార్హం.