‘గబ్బర్ సింగ్’ ఆడియో రిలీజ్ వేదికపై మాట్లాడుతూ హరీశ్ శంకర్ అన్నాడు.. ‘పవన్ కల్యాణ్ కు అభిమానులు ఉండరు.. భక్తులు మాత్రమే ఉంటారు’అని! అది నిజమే అనిపించే సంఘటనలు కోకొల్లలు. తాజాగా.. రిలీజ్ అయిన ట్రైలర్ మరోసారి ఆ విషయాన్ని నిరూపించింది.
రెగ్యులర్ సమయంలో పవన్ సినిమా వస్తేనే అభిమానులు భూమ్మీద ఆగరు. అలాంటిది.. మూడు సంవత్సరాల తర్వాత సినిమా రాబోతోంది. పరిస్థితి ఇంకెలా ఉంటుందీ..? ఇదిగో.. పైనున్న బొమ్మ చూస్తే తెలుస్తుంది.
ఇది హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్. వకీల్ సాబ్ ట్రైలర్ ను ఇక్కడే రిలీజ్ చేశారు. దర్శక నిర్మాతలు వేణు శ్రీరామ్, దిల్ రాజు, శిరీష్ వెళ్లి ట్రైలర్ ను లాంఛ్ చేశారు. ఈ వేడుకకు వచ్చిన అభిమానులను చూస్తే.. సినిమా రిలీజ్ వేడుకను తలపించింది. అట్టహాసంగా నిర్వహించిన వేడుకలో ఫ్యాన్స్ ధూమ్ ధామ్ గా చిందేశారు.
కేవలం రెండు నిమిషాల ట్రైలర్ కే ఇంత హంగామా చేస్తే.. రేపు సినిమా రిలీజ్ వేళ పరిస్థితి ఏంటన్నది అర్థం కాకుండా ఉంది. ఇప్పుడు ట్రైలర్ కూడా సూపర్ హిట్ కొట్టడంతో.. సినిమా రేంజ్ ఏంటన్నది లెక్కలు వేసుకుంటున్నారు. మూడేళ్ల తర్వాత వస్తున్న పవన్ ను తొలి ఆటలోనే చూసేయాలని ఆరాటపడుతున్నారు ఫ్యాన్స్. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.