
తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న దరిద్రాలల్లో ‘తెలుగు రాకపోవడం’ అనేది ఒకటి. పేరుకి తెలుగు హీరోలు, పుట్టింది అచ్చ తెలుగు కుటుంబాలల్లో, కానీ తెలుగు రాదు. హే ఏమిటయ్యా ఇది ? అని తనకు రాని తెలుగును అర్ధం చేసుకోవడానికి మన హీరోలు అసిస్టెంట్ డైరెక్టర్స్ మీద చిరాకు పడటం, సినిమా సెట్స లో తెలుగు డైలాగ్స్ చెప్పలేక పలకలేక షూటింగ్ కి ప్యాకప్ చెప్పడం వంటి సీన్లు సర్వసాధారణం అయిపోయాయి. కొంతమంది హీరోలకు తెలుగు అక్షరాలు చుస్తే జ్వరం వస్తోంది. మరికొంతమంది హీరోలు అయితే అసలు తెలుగు అక్షరాలను కూడా సరిగ్గా గుర్తుపట్టలేరు, కాబట్టి.. వారి గురించి ముచ్చటించుకోవడం కూడా అనవసరమే.
ఇంతకీ తెలుగు రాని హీరోలు ఎవరయ్యా అంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గర నుండి మంచు మనోజ్, మంచు విష్ణు, రానా, నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్ ఇలా చాలమందే ఉన్నారు లేండి. అదేంటి తెలుగు కూడా నేర్చుకోకపోవడం అనే ప్రశ్నలు వారికీ తరుచూ ఎదురవుతూ ఉంటాయట. అప్పుడు వారంతా చెప్పేమాట ‘తమ చిన్నతనమంతా చెన్నైలో గడిచిందని, అందుకే స్కూల్‌లో తెలుగు చదువుకోలేదని.. అందుకే తెలుగులో తమకు పట్టు లేదని.. ఇది కాస్త మమ్మల్ని ఇబ్బంది పెట్టే అంశమే అని, అయినప్పటికీ సినిమాకి ఎలాంటి నష్టం లేకుండా డైలాగ్స్ ప్రాక్టీస్ చెస్తామని చెబుతూ ఉంటారు.
ముఖ్యంగా షూటింగ్ సమయంలో స్క్రిప్ట్‌లోని తమ డైలాగులను దర్శకుడు, లేదా సహాయ దర్శకుల చేత చెప్పించుకుంటామని.. వాళ్ళు చెబుతున్న సమయంలో దాన్ని రికార్డ్ చేసుకొని.. మెమరీ ద్వారా వాటిని ఒకటికి నాలుగు సార్లు గుర్తుపెట్టుకుని సెట్ కి వచ్చి పలికేస్తామని హీరోలు చెబుతూ ఉంటారు. చాలామంది హీరోలు తమ మొదటి సినిమానుంచీ ఇదే పద్ధతిలో వెళుతున్నారు తప్ప.. ఏ రోజు తెలుగు నేర్చుకోవాలి అని మాత్రం వాళ్ళు అనుకోలేదు. అన్నట్టు ఇది ఒక రకంగా ప్రయోజనకరమట. తమ మైండ్‌లో మాడ్యులేషన్ ఏదీ లేదు కాబట్టి ఆ డైలాగ్ ను సహజంగా, గుండెల్లోనుంచి వస్తుందని ఆ మధ్య మహేష్ అన్నట్టు గుర్తు. ఏది ఏమైనా తెలుగు కూడా రాకుండా తెలుగు హీరోలు అని పిలిపించుకోవడానికి వాళ్ళు సిగ్గు పడాలి.