అనుకున్నదే అయింది.. భయపడినట్లే జరిగింది. ఓ వైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే మన లీడర్లేమో ఎలక్షన్ల పేరిట సభలు నిర్వహించడం మొదలుపెట్టారు. ఇంకే ఇప్పుడు కరోనా మరింత విజృంభించేందుకు ఛాన్స్ దొరికినట్లు అయింది. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కరోనా బారిన పడ్డారంటే రాష్ట్రంలో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న సీఎం సైతం కరోనా బారిన పడడంపై ఇప్పుడు అంతటా అదే చర్చ నడుస్తోంది.
ఎన్నికల్లో గెలుపు కోసం.. లేదంటే తమ పార్టీకి ఇంత బలం ఉందంటూ బలనిరూపణ చేసుకునేందుకు పార్టీలు పోటాపోటీగా ప్రచారం సాగించాయి. ఓ వైపు కరోనా పెరుగుతున్న వేళ కూడా అధికార పార్టీ టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ టైమ్‌లో ఇంత పెద్ద సభ అవసరమా అని చాలా వరకు విమర్శలు సైతం వచ్చాయి. హైకోర్టులో పలువురు స్వతంత్ర అభ్యర్థులు సైతం పిటిషన్లు ఇచ్చారు. కానీ.. కోర్టు తీర్పు సైతం అధికార పక్షానికే అనుకూలంగా తీర్పు రావడం కొసమెరుపు. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ వెంటవెంటనే సభకు ఏర్పాట్లు చేసేసింది. కేసీఆర్ హాజరవుతున్న ఈ సభ కోసం పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించారు. ఫైనల్‌గా సభ సక్సెస్ అయింది. గులాబీ దండు మొత్తం సంబురపడింది.
కానీ.. ఎవరూ ఊహించని విధంగా సభలో పాల్గొన్న చాలా మంది కరోనా బారిన పడ్డారు. అటు టీఆర్‌ఎస్ అభ్యర్థి అయిన నోముల భగత్‌తోపాటు పలువురు లీడర్లు వైరస్ బారిన పడ్డారు. ఇక సభ అయిపోయాక ఆరు రోజులకే సీఎం కేసీఆర్‌లో కూడా వైరస్ లక్షణాలు కల్పించాయి. వెంటనే టెస్టులు చేయగా.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒకవిధంగా ఇప్పుడు నాగార్జునసాగర్ కరోనా హాట్ స్పాట్‌గా మారిపోయింది.
అయితే.. కేసీఆర్‌కు కరోనా రావడానికి సభతోపాటే సభకంటే ముందు ఏర్పాటు చేసిన సమావేశం అని కూడా తెలుస్తోంది. హాలియా సభకు ముందు కేసీఆర్ ఏర్పాటు చేసిన సమావేశం ఆయన కొంప ముంచిందనే చెప్పాలి. సభ టైమ్ సాయంత్రం పెట్టుకోవడం.. వాతావరణం కూడా అనుకూలంగా లేకపోవడంతో హెలికాప్టర్‌లో కాకుండా కేసీఆర్ రోడ్డు మార్గాన వెళ్లారు. ఈ క్రమంలో పొట్టిచెల్మ వద్ద ఇరిగేషన్ శాఖకు చెందిన గెస్ట్ హస్‌లో ఆయన కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నారు. అప్పుడే.. ఆయన కొంత మందితో సమావేశం అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సమావేశం సాగింది. ఇందులో ముఖ్యంగా మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసానితోపాటు సాగర్ నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు.
అయితే.. ఈ సమావేశానికి హాజరైన కేసీఆర్ తన మూతికి కనీసం మాస్క్ కూడా ధరించలేదట. అప్పుడే కరోనా అంటినట్లుగా ప్రచారం నడుస్తోంది.
ఇక.. హాలియా సభ వేదిక కూడా కేసీఆర్‌కు కరోనా అంటించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఎంతో గ్రాండ్‌గా నిర్వహించిన ఈ సభలో వేదికపై ఏకంగా 50 మందికి పైగానే ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్టేజీ పైకి వచ్చేటప్పుడు కూడా ఆయన మూతికి మాస్క్ ఉన్నప్పటికీ.. వేదిక పైకి రాగానే పట్టనపడేశారు. ఇక.. వేదికపై ఉన్న చాలా మంది మాస్కులు పెట్టుకోలేదు. ఇంకొంత మంది అయితే కిందకు జార్చారు. అలాగే.. కేసీఆర్ మాట్లాడుతున్నంత సేపు క్యాండిడేట్ భగత్ కూడా ఆయన పక్కనే ఉన్నారు. కేసీఆర్ మాట్లాడిన తర్వాత కూడా భగత్‌తో కేసీఆర్ క్లోజ్‌గా మూవ్ అయ్యారు. దీంతో అటు భగత్‌కు పాజిటివ్ రావడం.. ఆ వెంటనే కేసీఆర్ కూడా పాజిటివ్ రావడం ఖాయమైపోయింది. కోవిడ్ రూల్స్ పాటిస్తూ సభ నిర్వహించామని నేతలు.. అధికారపక్షం చెప్పుకొచ్చినప్పటికీ.. కరోనా తన పని తాను చేసుకుపోయిందనేది వాస్తవం.