
సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేపట్టిన విచారణకు శుభం కార్డు పడింది. ఈ కేసులో ఎవరినీ దోషులుగా ఈడీ తేల్చలేదని తెలుస్తోంది. గతంలోనే తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ ఈ కేసులో విచారణ జరపడం, ప్రధాన నిందితుడు కెల్విన్ తో సహా డ్రగ్స్ వినియోగించారనే ఆరోపణలు వచ్చిన పలువురు సినీ ప్రముఖులను ప్రశ్నించడం తెలిసిందే. అయితే ఆ తరువాత ఈ కేసు మరుగున పడిపోయిందని భావించగా.. కోర్టు ఆదేశాలతో హఠాత్తుగా ఈడీ రంగంలోకి దిగింది.
కెల్విన్ తో ఆర్థిక లావాదేవీల ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ అధికారులు.. తిరిగి సినీ ప్రముఖులందరినీ తిరిగి పిలిచి ప్రశ్నించారు. అయితే.. కెల్విన్ ను, ఇతరులను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించినా.. వారికి ఎటువంటి ఆధారాలు లభించలేదని సమాచారం. పైగా ఈడీ విచారణ జరుపుతున్న సమయంలోనే తెలగాణ ఎక్సైజ్ శాఖ సినీ ప్రముఖులందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. 2017లో తాము వారి నుంచి సేకరించి పరీక్షించిన శాంపిళ్లలో ఎటువంటి డ్రగ్స్ ఆనవాళ్లు లేవని కోర్టుకు తెలిపింది. దాంతోపాటు సినీ ప్రముఖులకు కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేశాడనేందుకు కూడా ఆధారాలు లేవని పేర్కొంది.
సినీ ప్రముఖులు డ్రగ్సే వాడలేదని ఎక్సైజ్ శాఖ చెబుతున్నప్పుడు.. డ్రగ్స్ కోసం కెల్విన్ కు వారు డబ్బు చెల్లించారనే విషయాన్ని తాము ఎలా నిరూపించాలనే ప్రశ్న ఈడీ అధికారుల్లో ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. దీంతో విచారణను ముగించాలనే నిర్ణయానికి ఈడీ వచ్చినట్టు సమాచారం. ఫలితంగా సినీ ప్రముఖులను టెన్షన్ కు గురి చేసిన,తెలంగాణలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన డ్రగ్స్ వివాదానికి తెరపడినట్టేనని భావిస్తున్నారు. భవిష్యత్తులో మళ్లీ ఎవరైనా దీనిపై ప్రస్తావిస్తే తప్ప.. ఇప్పటికైతే శుభం కార్డు పడ్డట్టే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.