సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి పెద్ద సమస్య.. ఇగో. స్టార్స్ గా చలామణి అవుతోన్న వాళ్ళ మాటను చిన్నాచితకా నటీనటులు అలాగే దర్శకనిర్మాతలు లెక్క చెయ్యకపోతే.. ఇక వాళ్లకు లైఫ్ ఉండదు. ఇదేదో పాత తెలుగు సినిమా విలనిజమ్ కాదు. హీరోలుగా రికార్డ్స్ బ్రేక్ చేసినవాళ్లు చూపించిన విలనిజమ్. ఒక ఉదాహరణగా చెప్పుకుంటే.. అప్పటి గొప్ప హాస్య నటుడు ‘నగేష్’గారి జీవితంలో జరిగిన సంఘటనే గొప్ప ఉదాహరణ.
నగేష్ గారు తన కెరీర్ ప్రారంభంలో రైల్వే ఉద్యోగం చేసేవారు. అయితే ఆయనకు చిన్నతనం నుండే నటన అంటే పిచ్చి. ఆ పిచ్చితోనే ఆయన ఎన్నో నాటకాలు వేశారు. ఆ నాటకాల అనుభవంతోనే సినిమాల్లోకి రావాలనుకున్నారు. ఎన్నో కష్టాలు అవమానాలు అనంతరం తమిళంలో చాలా సినిమాల్లో ఆయన నటించి మెప్పించారు. స్వతహాగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడంతో నగేష్ గారిలో ఒక తెలియని దైర్యం ఉండేది.
ఆ దైర్యంతోనే అప్పటి తమిళ స్టార్ హీరో ఎంజీఆర్ కి నగేష్ కి మధ్య కొన్ని మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. సెట్ లో ఎంజీఆర్ వచ్చినప్పుడు నగేష్ లేవలేదట. అక్కడ మొదలైన వీరి మధ్య ఇగో నగేష్ జీవితాన్ని చాల బాధల్లోకి నెట్టింది. ఎంజీఆర్ చెప్పడంతో అప్పటి దర్శకనిర్మాతలు ఆయనకు అవకాశాలు ఇవ్వలేదు. ఆ క్రమంలోనే ఆయన తెలుగు సినిమాల్లో కూడా నటించారు.
ఆ తరువాత తమిళంలో కమల్ హాసన్ తో ఉన్న చనువుతో అక్కడ అవకాశాలు సంపాదించుకున్నారు. అయితే తన కొడుకు ఆనంద్ ను హీరోని చేసే క్రమంలో ఆస్తి మొత్తం పోగొట్టుకున్నారు నగేష్. చివరకు తనకు ఉన్న ఓ థియేటర్ ట్యాక్స్ చెల్లించలేకపోయారు. అప్పుడు సీఎంగా ఉన్న ఎంజీఆర్ ఆ కారణం చూపించి నగేష్ ని జైలుకి కూడా పంపి తన ఇగోని చల్లారించుకున్నారు.