
‘ఆర్జీవీ’ అంటేనే ‘వింత జీవి’ అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై ఇప్పటికే అనేక విమర్శలు వ్యంగ్యాస్త్రాలు వచ్చిపడ్డాయి. ఎవరు ఏమన్నా.. ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, ఆర్జీవీ మాత్రం తనలోని వికృతి చేష్టలను మానడం లేదు, ఎలాగూ ఇంతకు ముందులా ప్రేక్షకులను ఆకట్టుకొనేలా సినిమాలు తీయలేక చెత్త సినిమాల్లో పడి కొట్టుమిట్టాడతా ఉన్నా.. నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రావడమే ఆర్జీవీ అభిమానులను కూడా ఇబ్బంది పెడుతుంది. అసలు సినిమా దర్శకుడిగా కంటే కూడా, ప్రస్తుతం ట్వీటర్ రాయుడిగానే ఆర్జీవీ ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆర్జీవీని ప్రజలు మరిచిపోకుండా గుర్తుంచుకొనేలా ఆ ట్వీట్లు పనికొస్తున్నయేమో గానీ, ఆర్జీవీకి ఉన్న కనీస గౌరవాన్ని కూడా ఆ ట్వీట్లు దూరం చేస్తున్నాయి. ఇంతకు ముందు చంద్రబాబు పై పేరడీలు చేసి తెలుగు తమ్ముళ్ళ చేతులో తిట్లు తిన్నాడు. మధ్యమధ్యలో పవన్ కళ్యాణ్ పై సిల్లీ కామెంట్స్ చేసే క్రమంలో తన ట్వీటర్ అస్త్రాలను ప్రయోగించి.. పవన్ ఫ్యాన్స్ చేతిలో కూడా అడ్డమైన తిట్లు తింటూ.. చివరకు వాటిని కూడా ఎంజాయ్ చేస్తూ పెగ్ ల మీద పెగ్ లు వేస్తూ వస్తోన్నాడు. ఇక ఆర్జీవీ మారేది ఎప్పుడు ?, ఆ వింత జీవిలో పరివర్తన వచ్చేది ఎప్పుడు ? జీవితంలో చివరి దశ వరకూ ఇలాగే కొనసాగుతాడా ? లేక మార్పు ఏమైనా వస్తోందా ? ప్రస్తుతం ఆర్జీవీ అభిమానులను వేధిస్తోన్న ప్రశ్నలు ఇవి.
నిజానికి రామ్ గోపాల్ వర్మ తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి చాల దిగజారిపోయి ఉండొచ్చు. తన వెర్రి సిద్దాంతాలతో ఇప్పడు నవ్వులపాలు అవ్వొచ్చు. కానీ తెలుగు సినీపరిశ్రమలో హేమాహేమీలనదగ్గ అనేకమంది దర్శక దిగ్గజాల్లో ఆర్జీవీ కూడా ఒకరు. దర్శకుడిగా ఆయన తీసిన సినిమాల్లో చాలా గొప్ప చిత్రాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఇప్పటికీ ప్రజలను రంజింపజేయగలుగుతున్నాయి. ఆ కోణంలో నుండి చూస్తే రామ్ గోపాల్ వర్మ కచ్చితంగా తెలుగు సినిమా పరిశ్రమలో అందరి కంటే గొప్ప మేధావినే భావించాలి. ఆంత గొప్పదనం తనలో ఉందని నిరూపించుకోని.. ఇలా రోజురోజుకూ దిగజారిపోవడం నిజంగా ఆర్జీవీ దౌర్భాగ్యమే.