
ఇప్పటి స్టార్ హీరోలు అందరూ ఒకప్పుడు పెద్ద దర్శకుల చుట్టూ తిరిగిన వాళ్ళే. మంచి సినీ నేపథ్యం ఉన్నా.. తండ్రులు తాతలు సినీ దిగ్గజాలు అయినా, తమ మొదటి సినిమా కోసం ఆ సినీ వారసులు సైతం పెద్ద దర్శకుల కోసం పడిగాపులు కాయాల్సిందే. అంతెందుకు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడం ఇష్టం లేకే కదా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన అసిస్టెంట్ రాజమౌళికి జూనియర్ ని అప్పచెప్పాడు. ఎన్టీఆర్ అదృష్టం బాగుంది కాబట్టి.. రాఘవేంద్రరావు కంటే గొప్ప దర్శకుడు అయిన రాజమౌళి దర్శకత్వంలో తారక్ తన మొదటి హిట్ ను అందుకున్నాడు.
నిజానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అంటేనే వారసులను పరిచయం చేయగల గొప్ప ప్రతిభ గల దర్శకుడు అని నమ్మకం. పైగా తెలుగు స్టార్ హీరోల్లో చాలామందిని రాఘవేంద్రరావునే సినీ తెరకు పరిచయం చేశారు. వాళ్ళల్లో వెంకటేశ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి ఎంతో మంది స్టార్లు ఉన్నారు. పైగా మాస్, క్లాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను తన సినిమాలతో ఆకట్టుకోవడం అనేది అప్పట్లో దర్శకేంద్రుడి స్పెషాలిటీ. అందుకే ఆయనకు హీరోల అభిమానంతో పాటు ప్రేక్షకుల అభిమానం దక్కింది.
పైగా స్టార్లు సైతం తమ వారసుల్ని వెండితెరకు పరిచయం చేయాలనుకుంటే, ముందుగా రాఘవేంద్రరావునే సంప్రదించే వాళ్ళు. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న రోజులు అవి. ప్రభాస్ తండ్రితో పాటు ప్రభాస్ కి కూడా తన మొదటి సినిమా రాఘవేంద్రరావుతోనే చేస్తే బాగుంటుందని భావించారు. పైగా ప్రభాస్ తండ్రికి సన్నిహితులు కావడంతో ప్రభాస్‌తో ఓ చిత్రం చేయమని అడిగారట. కానీ, అది సాధ్యమవలేదు.
అయితే ప్రభాస్ ని పరిచయం చేయాలనుకున్నా… అప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉండటంతో తనకు అప్పుడు కుదరలేదు’ అని రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు. దర్శకేంద్రుడికి కుదరకపోవడంతో ఈ అవకాశం జయంత్ సి. పరాన్జీకి దక్కింది. ఆయనే ప్రభాస్‌ని ‘ఈశ్వర్’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.