Homeఆంధ్రప్రదేశ్‌ఏ క్షణమైనా తరలింపు.. విశాఖే ఇక ఏపీ రాజధాని..

ఏ క్షణమైనా తరలింపు.. విశాఖే ఇక ఏపీ రాజధాని..

Minister Botsa Satyanarayana

ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే.. దానికి కట్టుబడి పాలన సాగించడం జగన్‌ వంతు. మొండి పట్టుదలతో ముందుకు సాగుతూనే ఉంటారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఇప్పటికే హైకోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ మూడు రాజధానులను నడిపించడమేనని చెబుతున్నారు. ఇంకా ఆ కేసు ఎటూ తేలనేలేదు విశాఖకు పరిపాలనా రాజధానిని తరలించే యోచనలో ఉంది. మే 6 నాటికి విశాఖ నుంచే కార్యకలాపాలను సాగేలా ముహూర్తం నిర్ణయించినట్లు ఇదివరకే లీకులు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఏ క్షణమైనా పరిపాలన రాజధానిని విశాఖ తరలించే అవకాశం ఉందని ప్రకటించారు. అంటే.. ఇప్పటికే విశాఖలో దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ప్రభుత్వం మొదలుపెట్టి ఉండొచ్చునన్న చర్చ జరుగుతోంది. ‘మూడు రాజధానులపై టీడీపీ కోర్టుకు వెళ్లి అడ్డుకుంటోంది. ప్రభుత్వం తరుపున కోర్టుకు వాస్తవాలు వివరిస్తాం. మూడు రాజధానుల ఏర్పాటుతో జరిగే అభివృద్ధి గురించి చెబుతాం. రాష్ట్ర సమగ్రాభివృద్దే ప్రభుత్వ ధ్యేయం. కాబట్టి మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం’ అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్ సంకల్పం అని తెలిపారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ విధానపరమైన నిర్ణయం తీసుకున్నారని బొత్స పేర్కొన్నారు. అమరావతిని అవినీతికి, ఒక వర్గానికి అడ్డాగా మార్చి రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు నాయుడు 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. మిగిలిన 32 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కోర్టు అడ్డంకులు తొలగిపోగానే విలీన గ్రామాలతో కలిపి రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికలు పూర్తయిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సౌకర్యాలు, వసతుల కల్పనపై ఫోకస్ పెడుతున్నట్లు వివరించారు. కొత్తగా ఎన్నికైన మున్సిపల్‌ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లకు ఈ నెల 31, వచ్చే నెల 1న రెండు రోజులపాటు విజయవాడలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ను తరలించే పనులు ఇప్పటికే మొదలైనట్లు లీకులు వచ్చాయి. మే 6 నాటికి రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రధాన శాఖలన్నింటినీ అక్కడికి తరలించేలా ముఖ్యమంత్రి ఆయా శాఖలకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లుగానూ ప్రచారం జరుగుతోంది. దీంతో తమ శాఖల కార్యకలాపాలకు అనువైన భవనాల కోసం వెతికేందుకు ఇప్పటికే పలువురు అధికారులు విశాఖ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు స్థానిక విశాఖ నేతలు కూడా సహకరిస్తున్నట్లు సమాచారం. మే 30 నాటికి సీఎం జ‌గ‌న్ ప‌ద‌వీ ప్రమాణ‌స్వీకారం చేసి రెండేళ్లు పూర్తవుతుంది. ఈ నేప‌థ్యంలో మే 6 నాటికి కీలక శాఖలను అక్కడికి తరలిస్తే.. నెలాఖరు నాటికి అక్కడి నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం దొరుకుతుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version