సూపర్ స్టార్ తో సూపర్ హిట్ ఇచ్చాక ఎంత డిమాండ్ రావాలి. కానీ, డిమాండ్ సంగతి దేవుడెరుగు ? ఉన్న పరువు కూడా పోతుంది. మంచి సినిమా ఇచ్చిన తరువాత కూడా ఇంకా సినిమా కోసం పడిగాపులు కాయాల్సి రావడం నిజంగా బాధాకరమైన విషయమే. అసలు ఈ స్టార్ డైరెక్టర్ టైం ఎప్పుడూ ఇలాగే ఉంటుందా.. అయినా హిట్ ఇచ్చాక కూడా సంవత్సరాల తరబడి ఎదురుచూడటం ఎందుకు ? స్టార్ హీరో కాకపోతే చిన్న హీరో.. వాడు కూడా దొరకకపోతే కొత్త వాళ్ళను పెట్టి అయినా సినిమా తియ్యొచ్చు కదా.. మళ్ళీ ఆ డేర్ ఉండదు.
కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని నిట్టూర్పులు ఒకటి. చుట్టూ ఉన్నవాళ్ళు ‘స్టార్ హీరో కోసం ఎదురుచూడాల్సిన దౌర్భాగ్యం ఏమిటండి ?’ అంటూ సెటైర్స్ కూడా వేస్తున్నారు. అప్పటికీ మార్పు రాకపోతే ఏమి చేస్తాం. ఈ మాటలన్నీ దర్శకుడు వంశీ పైడిపల్లికి సంబంధించిన మాటలు. ఈ దర్శకుడి మనసులోని మాటలు కాస్త అటు ఇటుగా అలాగే ఉన్నాయి. ప్రస్తుతం తనకు ఆన్సర్ లేని ప్రశ్నగా మారిపోయిన అంశం ఏదైనా ఉంది అంటే.. అది తన కొత్త సినిమా ఎప్పుడు ? అనే ప్రశ్ననే.
అసలు రెండేళ్ల క్రితం విడుదలైన ‘మహర్షి’ తర్వాత ఇప్పటివరకు ఇంకో సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్ళలేకపోయాడంటేనే వంశీ ఎంత స్లోగా ఉన్నాడో అర్ధం అవుతుంది. ‘మహర్షి’ లాంటి ఆల్ టైం హిట్ తరువాత ఏ స్టార్ హీరో పిలిచి సినిమా చేయమని అడగలేదు. దానికి తగ్గట్టే మనోడి దగ్గర పెద్దగా స్క్రిప్ట్స్ కూడా లేవు. కథలు ఎప్పటికప్పుడు కొత్తగా రెడీ చేసుకోని వెళ్తేనే.. స్టార్ హీరోలు వెంటనే డేట్స్ ఇస్తారు. కానీ పైడిపల్లి ఒక కథ చేయడానికే ఏడాది సమయం తీసుకుంటాడట. అంత చేసి ఆ కథ బాగాలేకపోతే.. మరో కథ కోసం మరో ఏడాది. ఇది పరిస్థితి. ఇక ఇప్పట్లో ఈ స్టార్ డైరెక్టర్ నుండి సినిమా అంటే కష్టమే.