‘తెలంగాణ బీజేపీ నాయకత్వం మమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదు. గౌరవం లేని చోట మేం ఉండలేం’ అంటూ.. బీజేపీకి టాటా చెప్పారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు. దీంతో.. ఇక, ఏపీలోనూ బీజేపీ-జనసేన మైత్రికి బీటలు వారుతాయా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే.. తాజాగా ఈ రెండు పార్టీలూ కాంప్రమైజ్ అయ్యాయి. అంతేకాదు.. తెలంగాణలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని కూడా నిర్ణయించాయి.
గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించుకొని, అభ్యర్థులు నామినేషన్లు వేసిన తర్వాత.. పోటీ నుంచి వెనక్కు తగ్గారు పవన్. బీజేపీతో ఎలాంటి సంప్రదింపులు జరిగాయో తెలియదుగానీ.. కమలం పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల వేళ దోస్తీ కటీఫ్ చేస్తున్నట్టు ప్రకటించారు జనసేనాని.
అయితే.. మరోసారి సంధి ప్రయత్నాలు జరిగినట్టు సమాచారం. దీంతో.. మునిసిపల్ ఎన్నికల్లో కలిసి బరిలోకి దిగబోతున్నాయి రెండు పార్టీలు. ఈ మేరకు అధికార ప్రకటన విడుదల చేశారు నేతలు. పవన్ కల్యాణ్ కు ఏపీతోపాటు తెలంగాణలోనూ అభిమానగణం ఎక్కువే. అందుకే.. ఇద్దరూ కలిసిపోటీ చేస్తే లాభం ఉండొచ్చని బీజేపీ స్నేహ హస్తం చాచిందని చెబుతున్నారు.
అదే సమయంలో.. జనసేన గుర్తు గాజు గ్లాసును పర్మనెంట్ గా ఇచ్చేందుకు ఈసీ అభ్యంతరం చెప్పిందని కూడా వార్తలు వచ్చాయి. పార్టీ రిజస్టర్ అయిన తర్వాత ఇప్పటి వరకూ ఎన్నికల్లో పెద్దగా పోటీ చేయకపోవడం.. సరైన ఓటింగ్ శాతం లేకపోవడంతో శాశ్వత గుర్తు ఇవ్వలేదన్నది ఆ వార్తల సారాంశం.
ఇలా.. ఎవరి కారణాలు వారికి ఉండడంతో.. ఈ రెండు పార్టీలూ తెలంగాణలో మళ్లీ చేతులు కలిపాయని చెప్పుకుంటున్నారు. త్వరలో ఖమ్మంతోపాటు పలు మునిసిపాలిటీలకూ ఎన్నికల జరగబోతున్న విషయం తెలిసిందే. మరి, ఖమ్మంలోనే పోటీ చేస్తారా? ఇతర చోట్ల కూడా బరిలో నిలుస్తారా? అన్నది చూడాల్సి ఉంది.