గతవారం మంచి హైప్ తో రిలీజ్ అయిన చిత్రం ‘చావుకబురు చల్లగా’. వారంలోనే థియేట్రికల్ పోరాటం ముగించిందీ సినిమా. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం దారుణమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఎంతగా అంటే.. గీతాఆర్ట్స్ బ్యానర్ స్థాపించిన ఇన్ని దశాబ్దాల్లో ఏనాడూ ఇంతటి ఫెయిల్యూర్ రాలేదట!
ఈ సినిమాలోని ప్రధానమైన పాయింట్ తెలుగు ప్రేక్షకులకు అస్సలే నచ్చలేదన్న విషయం అర్థమూంది. ఈ మూవీలో తల్లీ కొడుకు కలిసి మందు తాగడమే కాకుండా.. తల్లికి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండడం అనే ఆడ్ పాయింట్ ను ప్రముఖంగా చూపించాడు దర్శకుడు. అయితే.. తల్లికి ఇలాంటి క్యారెక్టరా? అనుకున్నారేమోగానీ.. ఆడియన్స్ ఈ ఆడ్ పాయింట్ ను అంగీకరించలేదు.
దీంతో.. దారుణమైన ఫలితాన్ని చవిచూసింది సినిమా. తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు రూ.13 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిందీ మూవీ. గీతాఆర్ట్స్ బ్యానర్ పై ఉన్న నమ్మకంతో కొంచెం ఎక్కువే పెట్టి సినిమాను కొనుగోలు చేశారు. కానీ.. లాంగ్ రన్ లో ఈ సినిమా కేవలం రూ.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇదికూడా గ్రాస్ మాత్రమే కావడంతో.. షేర్ మరింత తక్కువగా ఉంటుంది.
హీరో కార్తికేయ గతంలో ఇలాంటి డిజాస్టర్ చూసినప్పటికీ.. గీతాఆర్ట్స్ బ్యానర్ కు మాత్రం ఇదే మొదటిసారని అంటున్నారు. లో బడ్జెట్ లో ఓ ప్రయోగం చేయగా.. అది బెడిసికొట్టింది. భారీ ప్రమోషన్ తో తొలిరోజు మాత్రమే మంచి ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం.. ఆ తర్వాత మౌత్ టాక్ తో దారుణంగా పడిపోయింది.