
రాజమౌళి ఏం టైంలో స్ట్రాట్ చేశాడో కానీ.. సంవత్సరంలో పూర్తి చేస్తానని వాగ్ధానం చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రెండేళ్లు గడిచినా ఇంకా విడుదలకు నోచుకోలేదు. బాహుబలి కోసం 5 ఏళ్లు కష్టపడిన జక్కన్న ‘ఆర్ఆర్ఆర్’ను ఏడాదిలోనే తీస్తానన్నాడు.కానీ కరోనా వైరస్ తోనే ఒక్క ఏడాది తుడుచుపెట్టుకుపోయింది. షూటింగ్ రెండేళ్లు సాగింది. మధ్యలో రాంచరణ్ కు, రాజమౌళికి కరోనా సోకింది.. నిర్మాతకూ అదే పరిస్థితి.. ఆ తర్వాత మధ్యలో యూనిట్ సభ్యులకు కరోనా..
ఇలా మొత్తంగా కరోనా వల్ల ఆర్ఆర్ఆర్ షెడ్యూల్ గాడి తప్పింది. ఎప్పుడు ఎవరికి ఏం అవుతుందో తెలియక అనుకున్న సమయానికి ఏ పని పూర్తికాక రాజమౌళి తలలు పట్టుకున్నాడు. ఇప్పటికే సినిమాను ఈ దసరాకు రిలీజ్ చేస్తానని ప్లాన్ చేశాడు. మరి అప్పుడు అవుతుందా? లేదా అన్నది వేచిచూడాలి.
తాజాగా ఆర్ఆర్ఆర్ టీంకు మరో ఎదురుదెబ్బ తగిలింది. చివరి షెడ్యూల్ ను ‘ఆలియా భట్’తో ప్లాన్ చేశారు. రాంచరణ్ పక్కన సీతగా నటిస్తున్న ఈమె ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో పాల్గొనాల్సి ఉంది. కానీ తాజాగా ‘ఆలియా భట్’కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్ లో ఉంది.
సంజయ్ లీలాభన్సాలీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది ఆలియా. ఆ సినిమా టైంలోనే దర్శకుడు భన్సాలీకి కరోనా సోకింది. ఆ తర్వాత హీరో రణబీర్ కు పాజిటివ్ గా తేలింది. ఇప్పుడు ఆలియా భట్ కూడా కరోనాతో ఐసోలేషన్ లోకి వెళ్లింది. దీంతో ఆర్ఆర్ఆర్ షెడ్యూల్ మరోసారి వాయిదా పడింది.