ఏపీలో రాజకీయాల్లో ఎప్పుడూ ఆసక్తికరంగానే అనిపిస్తుంటాయి. అక్కడి రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరం ఊహించలేం. ఇప్పుడు మళ్లీ మరోసారి రాజకీయాలు వేడెక్కే పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ఎన్నికల అధికారిగా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే ఎంపీటీసీ.. జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు తేదీలను ప్రకటించారు. ఉదయం నుంచి ఆ ప్రచారం జరుగుతూనే ఉంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తేదీలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతూనే ఉన్నారు. అయితే.. నీలం సాహ్ని ప్రకటనపై జనసేన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
ఒకవైపు శుక్రవారం అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించి.. మరోవైపు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవటం ఏమిటన్న ప్రశ్నను సంధిస్తోంది. తమను అఖిలపక్ష భేటీకి పిలిచినట్లే పిలిచి.. ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయటంలో అర్థం ఏమిటని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తున్నారు. పార్టీల అభిప్రాయాలను తెలుసుకోకుండా.. ఎవరినీ సంప్రదించకుండా.. ఎవరితో ఏం డిస్కస్ చేయకుండా నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక అఖిలపక్ష భేటీకి పిలవడంలో అర్థం ఏముందని.. అందుకే తాము ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని జనసేన స్పష్టం చేఇంది.
పార్టీల అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకోకుండా పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు పెట్టాలని నిర్ణయించటం ఏమిటని మండిపడింది. ‘పోలింగ్.. ఓట్ల లెక్కింపు తేదీల్ని కూడా ఖరారు చేశారు.. ఇదేం పద్ధతి? కచ్చితంగా ఇది అప్రజాస్వామిక చర్య. అందుకే అఖిలపక్ష భేటీకి హాజరు కాకూడదు’ అని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు జనసేన వెల్లడించింది. ఎంపీటీసీ.. జడ్పీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన మొదట్నించి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు హైకోర్టు పిటిషన్ వేసింది కూడా. కోర్టు నుంచి తీర్పు వెలువడక ముందే.. ఎన్నికల ప్రక్రియ ఎలా షురూ చేస్తారని ప్రశ్నిస్తోంది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అధికార వైసీపీ సైతం ఇదే రీతిలో అఖిలపక్ష భేటీని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకించింది. ఆయన నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించింది. ఎన్నికలు వద్దన్న తమ అభిప్రాయాన్ని రాతపూర్వకంగా తెలియజేసింది. ఆ సందర్భంలో నిమ్మగడ్డ కోర్టును ఆశ్రయించి.. తన వాదనను నెగ్గించుకున్నారు. నాడు వైసీపీ అనుసరించిన విధానాన్నే తాజాగా జనసేన కూడా అనుసరిస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే జనసేన ఈ ఎన్నికలను బహిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్