
కొంతమందికి అన్నీ ఉంటాయి, కానీ అదృష్టం అనే ఒక్క ఐటమ్ లేక ఆశించిన స్థాయిలో కెరీర్ లో రాణించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారి జాబితాలో ప్రప్రధమంగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంటాడు అల్లు శిరీష్. అసలు తెలుగు చిత్రసీమలోని అతి పెద్ద సినీ నిర్మాణ సంస్థకి అల్లు శిరీష్ వారసుడు. దాదాపు నలుగురు స్టార్ హీరోల సపోర్ట్ ఉన్న ఏకైక యంగ్ హీరో.
కానీ, హీరోగా మాత్రం సరైన హిట్ ను కొట్టలేక బాక్సాఫీస్ వద్ద సతమతమవుతున్నాడు. ఇంతవరకూ స్టార్ డమ్ ను సంపాధించలేకపోయానే అనే బాధతో ప్రస్తుతం జిమ్ లో తెగ కష్టపడుతున్నాడు. కరోనా లాక్ డౌన్ నుండి ఈ అల్లు హీరో తన ఫిట్ నెస్ అండ్ యాక్టింగ్ పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ముఖ్యంగా తన బరువును తగ్గించి, స్లిమ్, ఫిట్ లుక్ లో మారడానికి చెమటలు చిందించాడు.
అనుకున్నట్టుగానే మొత్తానికి అద్భుతమైన లుక్ లో కనిపిస్తున్నాడు అల్లు శిరీష్. తాజాగా జిమ్ లో వర్కౌట్స్ చేసిన తరువాత, సిక్స్ ప్యాక్ లుక్ కనిపించేలా ఓ మిర్రర్ సెల్ఫీ తీసుకుని దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ సిక్స్ ప్యాక్ ఫోటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఏది ఏమైనా అల్లు శిరీష్ ఈ సారి ఎలాగైనా సాలిడ్ కొట్టాలనే కసితో ఉన్నాడు.
తన లాస్ట్ సినిమా ‘ఏబిసిడి’ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. ఆ చిత్రం అల్లు శిరీష్ కి విజయాన్ని అందించలేకపోయింది. అందుకే ఈసారి కొత్తరకం కథల కోసం కసరత్తులు చేస్తున్నాడు. అయినా బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా.. ఇంకా ఓ కమర్షియల్ హిట్ కూడా కొట్ట లేకపోవడం బాధాకరమైన విషయమే. గీతా ఆర్ట్స్ సంస్థ బయట హీరోలకు మంచి హిట్లు ఇస్తోంది కానీ, ఎందుకో అల్లు శిరీష్ ను స్టార్ ను చేసే విషయంలో మాత్రం పూర్తిగా తేలిపోతుంది.