మన దేశంలో 10 రూపాయల నోటు నుంచి 2,000 రూపాయల నోటు వరకు ఎన్నో నోట్లు వాడుకలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే జీరో రూపాయి నోటు గురించి మాత్రం ప్రజల్లో చాలామందికి తెలియదు. దేశంలో చాలా సందర్భాల్లో ప్రభుత్వ అధికారులకు లంచం ఇస్తే మాత్రమే పనులు జరుగుతాయనే సంగతి తెలిసిందే. లంచం అడగడం, లంచం ఇవ్వడం రెండూ నేరమే అయినా కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో లంచం ఇవ్వాల్సి వస్తుంది.
Also Read: అప్పుడు రూ. వెయ్యి పెట్టుబడి.. ప్రస్తుతం రూ. 4 కోట్ల రాబడి
అమెరికాలో పని చేసి భారత్ కు వచ్చిన ఆనంద్ అనే వ్యక్తి మన దేశంలో జరుగుతున్న అవినీతిని చూసి 2007 సంవత్సరంలో అవినీతికి చెక్ పెట్టడానికి ఫిఫ్త్ పిల్లర్ అనే స్వచ్ఛంద సంస్థను మొదలుపెట్టారు. ఈ సంస్థ జీరో రూపీ నోట్లను ముద్రిస్తుంది. సాధారణ కరెన్సీలు చెల్లుబాటు అయిన విధంగా జీరో రూపీ నోట్లు చెల్లుబాటు కావు. ఆ నోట్లపై అమౌంట్ కు బదులుగా జీరో అని ఉంటుంది.
ఈ నోట్లు చూడటానికి సాధారణ 50 రూపాయల నోట్లు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయి. ఈ నోట్లపై లంచం ఇవ్వను మరియు తీసుకోననే ప్రమాణం ఉంటుంది. ఎవరైనా లంచం అడిగితే మొదట అవినీతి నిరోధక వ్యవస్థ అధికారులకు సమాచారం ఇచ్చి ఈ నోట్లను ఇస్తే మంచిది. 2014 సంవత్సరం వరకు ఈ సంస్థ 25 లక్షల నోట్లను ముద్రించడం గమనార్హం. ఈ సంస్థ అధ్యయనంలో గతేడాది దేశంలో 490 కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని తేలింది.
అధికారులకు లంచం ఇచ్చి పట్టుబడితే అధికారి అతను లంచం ఇవ్వడం వల్లే తీసుకున్నానని చెప్పే అవకాశం ఉంటుంది. జీరో నోట్లను ఇవ్వడం వల్ల లంచం ఇచ్చినట్లు కాదు కాబట్టి అవినీతి అధికారి బండారం సులభంగా బయటపెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. https://5thpillar.org వెబ్ సైట్ ద్వారా ఈ నోట్లను తీసుకునే అవకాశం ఉంటుంది.