Xiaomi small electric car: పెట్రోల్ ధరలు పెరగడంతో చాలా మందికి మైలేజ్ సమస్య ఎదురవుతోంది. దీంతో ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి సమయంలో కంపెనీలు సైతం విద్యుత్ కార్ల ఉత్పత్తిపై ఫోకస్ పెడుతున్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల EVలు మార్కెట్లోకి వచ్చాయి. అయితే కాస్త ఆకర్షణీయంగా మైలేజ్ ఎక్కువగా ఇచ్చే కార్లను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఓ కారు విపరీతంగా టెంప్ట్ చేస్తోంది. ఈ కారు చూడ్డానికి చాలా చిన్నగా కనిపిస్తోంది. కానీ దీని మైలేజ్ చూస్తే మాత్రం వెంటనే కొంటానంటారు. ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ లాగా.. ఈ కారు సైజు చిన్నదే అయినా.. మైలేజ్ మాత్రం ఘనంగా ఉండనుంది. ఇంతకీ ఇది ఏ కారు? ఇది ఇచ్చే మైలేజ్ ఎంత?
చైనాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ First Auto Works (FAW) తన అనుబంధ బ్రాండ్ అయిన ‘బెస్ట్‌ట్యూన్’ (Bestune)ద్వారా Xiaoma అనే మైక్రో ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. చైనాలో దీనికి ‘బెస్ట్‌ట్యూన్ పోనీ’ అని కూడా అంటారు. తక్కువ ధరలో ఎక్కువ మైలేజీని కోరుకునే సామాన్యులను దృష్టిలో పెట్టుకుని ఈ కారును రూపొందించారు.
Xiaoma కారు చాలా కాంపాక్ట్ డిజైన్‌తో చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. కానీ దీని పొడవు కేవలం 3 మీటర్ల మాత్రమే. దీంతో రద్దీగా ఉండే నగరాల్లో పార్కింగ్ తో పాటు ప్రయాణానికి చాలా అనువుగా ఉంటుంది. ఈ కారు ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఇందులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, ప్రీమియం లుక్ ఇచ్చే ఫినిషింగ్ ఉంటారు. ప్రయాణంలో కొత్త అనుభూతిని పొందాలని అనుకునేవారికి ఇది సౌకర్యాన్ని అందిస్తుంది. సేప్టీ కోసం ఇందులో డ్రైవర్ వైపు ఎయిర్‌బ్యాగ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS),ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ కారు మైలేజ్ గురించి తీవ్రంగా చర్చ సాగుతోంది. కొన్ని నివేదికల ప్రకారం.. ఈ కారు ఫుల్ ఛార్జ్‌పై 1200 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే అసలు విషయం ఏంటంటే ఈ కారు యొక్క స్టాండర్డ్ ఎలక్ట్రిక్ వేరియంట్ సాధారణంగా 120 కి.మీ నుండి 170 కి.మీ రేంజ్ ఇస్తుంది. కానీ, ఇందులో ‘రేంజ్ ఎక్స్టెండర్’ (Range Extender) అనే టెక్నాలజీని వాడటం ద్వారా ఇది దాదాపు 1200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంటోంది. అంటే బ్యాటరీతో పాటు ఒక చిన్న ఇంజిన్ సహాయంతో రేంజ్ పెంచుకునే వెసులుబాటు ఇందులో ఉంటుంది.
చైనా మార్కెట్లో ఈ కారు ధర సుమారు 30,000 నుండి 50,000 యువాన్ల మధ్య ఉంది. అంటే భారతీయ కరెన్సీలో దీని ధర దాదాపు రూ. 3.50 లక్షల నుంచి రూ. 5.80 లక్షల వరకు ఉండవచ్చు. ఇంత తక్కువ ధరలో భారీ మైలేజీని అందించే కారు కావడం వల్ల ఇది ఇతర ఎలక్ట్రిక్ కార్లకు గట్టి పోటీనిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతానికి ఈ కారు చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, టాటా టియాగో EV, MG కామెట్ EV వంటి చిన్న కార్లకు పోటీగా దీనిని త్వరలో భారతదేశంలో కూడా విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. భారత్ లాంటి దేశాల్లో తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే కార్లకు డిమాండ్ ఎక్కువ కాబట్టి, ఇది ఇక్కడ విజయవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి.