Gold And Silver Prices: బంగారం.. ఇది ప్రస్తుతం ధనవంతుల ఆభరణంగా మారింది. పేదలకు ఎప్పుడూ అందుబాటులో లేని బంగారం.. రెండు మూడేళ్ల క్రితం వరకు మధ్య తరగతికి అందుబాటులో ఉంది. గడిచిన ఏడాదిగా అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న బంగారం ధరలు.. దానిని ధనవంతుల వస్తువుగా మార్చాయి. నేనేం తక్కువ అన్నట్లు బంగారం బాటలోనే వెండి ధర కూడా భారీగా పెరిగింది. దీంతో అందరూ ఇప్పుడు బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. కానీ ప్రపంచ బులియన్ మార్కెట్లలో మంగళవారం రాత్రి బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. ఔన్సు బంగారం ధర 245 డాలర్లు పడిపోవడం, వెండి 3.9 డాలర్ల నష్టంతో ట్రేడ్ అవ్వడం గత 12 సంవత్సరాల తర్వాత కనిపిస్తున్న విపరీత మార్పు. ఈ దిద్దుబాటు 2013 తర్వాత దాదాపు అత్యధికంగా నమోదైంది.
ధరల పతనానికి ప్రధాన కారణాలు..
బంగారం వెండి ధరలు ఒక్కసారిగా పతనం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధాన కారణాలు పరిశీలిస్తే ఇటీవల రికార్డు స్థాయికి చేరిన బంగారంపై పెట్టుబడిదారులు లాభాలు ఆశిస్తున్నారు. ఇదేసమయంలో డాలర్ బలపడటం బంగారం ధరపై ఒత్తిడి పెంచింది.మధ్యప్రాచ్య, యూరప్ ప్రాంతాల్లో యుద్ధాలు తగ్గి మార్కెట్ స్థిరపడడంతో బంగారం, వెండి ధరల్లో భారీగా తగ్గుదల నమోదైంది.
దేశీయ మార్కెట్‌పై ప్రభావం..
డాలర్ విలువను రూ.88గా పరిగణిస్తే, ప్రస్తుత అంతర్జాతీయ రేట్ల ప్రకారం గ్రాము 24 క్యారెట్ల బంగారం రూ.12,636, 10 గ్రాములు రూ.1.26 లక్షలకు సమానమవుతుంది. వెండి కిలో ధర సుమారు రూ.1.49 లక్షలుగా ఉంటుంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో సోమవారం 10 గ్రాముల బంగారం రూ.1.31 లక్షలు కాగా, ఇప్పుడు దాదాపు రూ.5,500 వరకు తగ్గే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాత్కాలిక ప్రభావమేనా?
బులియన్ ట్రేడర్లు ఈ దిద్దుబాటు తాత్కాలికమని, మదుపర్ల ప్రవర్తన, వచ్చే వారాల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ నిర్ణయాలపై ఆధారపడి ధరల దిశ మారుతుందని పేర్కొన్నారు. డిమాండ్ దశలోకి దివాళీ సీజన్ ప్రవేశిస్తున్నందున, దేశీయ మార్కెట్లలో కొనుగోలు తిరిగిచేపట్టే అవకాశం ఉంది.
బంగారం, వెండి ధరలు గణనీయంగా పడిపోవడం ప్రపంచ ఆర్థిక వాతావరణంలోని సున్నితతను ప్రతిబింబిస్తోంది. ఇది ద్రవ్య విధానం, జియోపాలిటికల్ పరిస్థితులు, పెట్టుబడి ధోరణులు కలయిక ఫలితం. అయినప్పటికీ భారత మార్కెట్లో వినియోగదారులకు ఇది తాత్కాలికమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.