Water Purifier : ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్రాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన నీరు దొరకడం గగనమైపోయింది. దీంతో చాలా మంది ఇళ్లలో నీటిని శుద్ధి చేయడానికి వాటర్ ప్యూరిఫైయర్‌లను ఉపయోగిస్తున్నారు. త్రాగే నీరు స్వచ్ఛంగా, ఆరోగ్యంగా ఉండాలనేది దీని ప్రధాన ఉద్దేశ్యం. అయితే, ఫిల్టర్‌ను కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది ఆల్కలైన్ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్ ఏది తీసుకోవాలా అని గందరగోళానికి గురవుతారు. ఈ రెండు రకాల ఫిల్టర్లు నీటిని శుద్ధి చేయడానికే తయారు చేసినప్పటికీ వాటి పనితీరు, ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి. అంతేకాకుండా, వాటి ధరలలో కూడా గణనీయమైన వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి, ఈ రెండు ఫిల్టర్లు ఎలా పనిచేస్తాయనేది తెలుసుకుందాం.
Also Read : పెరిగిన కాలుష్యం, పొగమంచు… రూ.15వేల కంటే బెస్ట్ ఎయిర్ ఫ్యూరిఫైయర్లు ఇవే
ఆల్కలైన్ ఫిల్టర్ అంటే ఏమి చేస్తుంది?
ఆల్కలైన్ ఫిల్టర్ నీటి pH స్థాయిని పెంచడం ద్వారా దానిని కొద్దిగా క్షారంగా (ఆల్కలైన్)మారుస్తుంది. ఇది మన శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆమ్ల ఆహారం లేదా నీరు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.
ఆల్కలైన్ ఫిల్టర్ ప్రయోజనాలు
ఇది నీటిలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలను కలుపుతుంది. దీని ద్వారా నీటి రుచి పెరుగుతుంది. శరీరంలో ఆమ్లత్వం తగ్గుతుంది. ఇందులో లభించే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సాయపడతాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించే, స్వచ్ఛమైన నీటిని తాగాలని కోరుకునే వారికి ఆల్కలైన్ ఫిల్టర్లు ఉపయోగించవచ్చు.
కార్బన్ ఫిల్టర్ అంటే ఏమి చేస్తుంది?
కార్బన్ ఫిల్టర్ నీటి దుర్వాసన, రుచి, హానికరమైన రసాయనాలను తొలగిస్తుంది. ఇందులో యాక్టివేటెడ్ కార్బన్ ఉంటుంది. ఇది చిన్న రంధ్రాల ద్వారా నీటిలో కలిసిపోయిన మురికిని పీల్చేస్తుంది.
కార్బన్ ఫిల్టర్ ప్రయోజనాలు
ఇది నీటిలో ఉన్న క్లోరిన్, హానికర పురుగుమందులను తొలగిస్తుంది. నీటి రుచి, వాసనను మెరుగుపరుస్తుంది. ఇది నీటిని శుభ్రం చేస్తుంది. నీటిలో క్లోరిన్ లేదా దుర్వాసన సమస్యలు ఉన్న ప్రాంతాల్లో కార్బన్ ఫిల్టర్ చక్కగా పనిచేస్తుంది.
ఏది బెస్ట్
ఏ ఫిల్టర్ బెస్ట్ అనేది మీరు ఉంటున్న ప్రదేశం, మీ అవసరం మీద ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన నీటిని తాగాలనుకుంటే ఆల్కలైన్ ఫిల్టర్ ఎంచుకోవచ్చు. మీ ప్రాంతంలోని నీటికి చెడు రుచి లేదా వాసన ఉంటే కార్బన్ ఫిల్టర్ ప్రయోజనకరంగా ఉంటుంది. కావాలంటే రెండింటినీ కలిపి కూడా ఉపయోగించవచ్చు. మొదట కార్బన్ ఫిల్టర్ నుండి మురికిని తొలగించి, తర్వాత ఆల్కలైన్ ఫిల్టర్ నుండి ఖనిజాలను జోడించవచ్చు.