TRAI : మొబైల్ ఫోన్ జీవితంలో ఒక భాగంగా కాదు కాదు.. ఒక అంగంగా మారిపోయింది. ఎందుకంటే నేడు ఇది లేనిది మనిషి బయటకు వెళ్లడం అనేది దాదాపు అసాధ్యం. ప్రపంచంలో ఏ మూల ఉన్న వ్యక్తితోనైనా అతి తక్కువ సమయంలో క్షేమ సమాచారం తెలుసుకునే వీలు కల్పించింది మొబైల్. దీనితో పాటు చాలా పనులు మొబైల్ లో జరుగుతున్నాయి. ఇండియా 4Gతో కొంచెం ముందడుగు వేసినా 5G తో మాత్రం వేగంగా దూసుకుపోతోంది. ఇక 6G పై ఇప్పుడిప్పుడే ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇది కూడా వస్తే జీవితం మరింత వేగంగా మారుతుందని నిపుణులు చెప్తున్నారు. అయితే, మొబైల్ వాడకం పెరుగుతుండడంతో వాటిని ఆధారంగా చేసుకున్న తయారీ కంపెనీల సంపాదన కూడా విపరీతంగా పెరిగిపోయింది. మొబైల్ తయారీ, అందులోని పరికరాలు అనేవి వినియోగదారులకు ఒక్కసారే ఉపయోగం పడుతున్నా.. రీచార్జి మాత్రం జీవితాంతం చేయించక తప్పదు. దీనిని ఆసరాగా చేసుకున్న నెట్‌వర్క్ కంపెనీలు అందిన కాడికి దోచుకుంటున్నాయి. గతంలో ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ నెట్ వర్క్ లు భారీగా రీచార్జి ప్లాన్లు తీసుకువచ్చింది. జియో రావడంతో ప్లాన్లు చవకగా మారిపోయాయి. చవకగా అనేకంటే రీజినల్ గా మారాయి. కానీ అందులో కూడా ఒక ఇబ్బంది లేకపోలేదు.
మొబైల్స్ వచ్చిన కొత్తలో సింగిల్ సిమ్ లు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత డ్యూయల్ సిమ్ మొబైల్స్ తీసుకువచ్చారు. నెట్ వర్క్ లను తరుచూ మార్చుతున్న వారు వీటిని ఉపయోగించుకొని ఒక్కో సిమ్ కు ఒక్కో నెంబర్ ఉపయోగించడం మొదలు పెట్టారు. 5G రావడంతో అన్ని నెట్ వర్క్ కంపెనీలు రీచార్జి వాల్యూ ధరను విపరీతంగా పెంచాయి. వాయిస్ కాల్, డేటా, ఎస్ఎంఎస్ అంటూ ప్లాన్లను తీసుకువచ్చింది. దీంతో డ్యూయల్ నెంబర్ మేయింటెన్ చేసే వారికి రిస్క్ పెరిగింది.
ఒక నెంబర్ రీచార్జి చేయించాలంటే ఒకే.. కానీ రెండు నెంబర్లు రీచార్జి చేయించడంతో తడిచి మోపెడవుతుంది. దీంతో వినియోగదారులపై భారం భారీగా పెరిగింది. రెండు నెంబర్లు ఉపయోగంలో ఉండడంతో రీచార్జి తప్పనిసరిగా మారిపోయింది. బ్యాంకు అకౌంట్లు, క్రెడిట్ కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాలు, తదితరాలకు స్ట్రాండర్డ్ గా ఒక నెంబర్ వినియోగిస్తున్నారు. రెండో నెంబర్ జనరల్ కాల్స్, డేటాకు ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల సైబర్ నేరగాళ్ల భారీ నుంచి కూడా కొంత సేఫ్ అవుతున్నారు. కానీ రెండు నెంబర్లను రీచార్జి చేయిస్తే మాత్రం తడిసి మోపెడవుతుంది.
ఈ విషయం గ్రహించిన ‘ట్రాయ్’ సిమ్ యాక్టివ్ గా ఉండేందుకు, కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ లకు ప్లాన్లను సిద్ధం చేసుకోవాలని నెట్ వర్క్ సంస్థలను ఆదేశించింది. ఈ విధానంతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉండేవారికి నెట్ వర్క్ సరిగా ఉండదు. వారి కోసం కూడా నెట్ వర్క్ సంస్థలు ఆలోచించాలని సూచించింది. ట్రాయ్ ఆదేశం డ్యూయల్ సిమ్ వినియోగదారులు, గ్రామీణుల నోట్లో పంచదార పోసినట్లయ్యింది. ఈ ప్లాన్లను వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది.