Tata Motors : భారత మార్కెట్‌లో అత్యధిక సంఖ్యంలో కార్లను విక్రయించే కంపెనీలో టాటా మోటార్స్ ఒకటి. ఇటీవలే కంపెనీ తమ కొత్త హారియర్ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. లాంచ్ అయినప్పటి నుంచి ఈ కారు మార్కెట్లో అద్భుతమైన స్పందన పొంది. ముఖ్యంగా జూలై 2న బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 24 గంటల్లోనే 10 వేలకు పైగా బుకింగ్స్ రావడంతో ఈ కారు సెన్సేషన్ క్రియేట్ చేసింది. టాటా ఇప్పటికే పుణె ప్లాంట్‌లో ఈ కారు ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ కారు సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 622 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఇది ఈ సెగ్మెంట్‌లో రెండో అతిపెద్ద బుకింగ్ రికార్డు. ఈ ఏడాది ప్రారంభంలో మహీంద్రా తమ XEV 9e ను లాంచ్ చేసినప్పుడు కూడా ఇలాంటి స్పందనే వచ్చింది. కొత్త హారియర్ ఎలక్ట్రిక్ కారు సింగిల్ ఛార్జ్‌పై 622 కి.మీ.ల రేంజ్ ఇస్తుంది. ఇందులో రెండు బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మొదటిది 65 kWh బ్యాటరీ ప్యాక్ , రెండోది 75 kWh బ్యాటరీ ప్యాక్.
చిన్న బ్యాటరీ ప్యాక్‌తో 538 కి.మీ.ల రేంజ్ లభిస్తుంది. పెద్ద బ్యాటరీతో 627 కి.మీ.ల రేంజ్ వస్తుంది. టాటా తమ C75 టెస్టింగ్ స్టాండర్డ్ ప్రకారం మెరుగైన రేంజ్‌ను అంచనా వేస్తుంది. ఈ స్టాండర్డ్ ప్రకారం 65kWh బ్యాటరీ మోడల్ సుమారు 420 నుండి 445 కిలోమీటర్ల మధ్య రేంజ్‌ను ఇస్తుంది. అలాగే, 75kWh బ్యాటరీ ప్యాక్ ఉన్న వేరియంట్ సుమారు 480 నుండి 505 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. టాటా హారియర్ ఈవీలో అనేక అడ్వాన్స్ డ్ టెక్నాలజీ, అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.ఈ ఎస్‌యూవీలో 540-డిగ్రీ కెమెరా సిస్టమ్ ఉంది. ఇది సాధారణ 360-డిగ్రీ వ్యూతో పాటు కారు కింద ఉన్న ప్రాంతాన్ని కూడా చూపిస్తుంది. ఈ ఫీచర్ ‘ట్రాన్స్‌పరెంట్ మోడ్’లో యాక్టివ్ అవుతుంది. ముఖ్యంగా ఆఫ్-రోడింగ్ లేదా గుంతలు ఉన్న రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది.
Also Read: కాలం మారింది: హాలీవుడ్ ఫ్లాప్ అవుతోంది.. మన సినిమాలు హాలీవుడ్ ను ఆకర్షిస్తున్నాయి…
హారియర్ ఈవీ దేశంలోనే మొదటి మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా నిలిచింది. ఇందులో డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంది. ముందు, వెనుక ఇరు వైపులా ఎలక్ట్రిక్ మోటార్లు ఉండటం వల్ల మెరుగైన ట్రాక్షన్, పవర్ డెలివరీ లభిస్తుంది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇందులో ఉన్న బూస్ట్ మోడ్ సహాయంతో ఈ కారు కేవలం 6.3 సెకన్లలో 0 నుండి 100 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుంది.సాధారణ హారియర్‌లో మూడు డ్రైవ్ మోడ్‌లు (నార్మల్, రఫ్, వెట్) మాత్రమే ఉంటాయి. అయితే, హారియర్ ఈవీలో 6 మల్టీ-టెర్రైన్ మోడ్‌లు ఉన్నాయి: నార్మల్, మడ్ రట్స్, రాక్ క్రాల్, సాండ్ , స్నో/గ్రాస్, కస్టమ్. క్యాబిన్‌లో 14.5 అంగుళాల పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది ఇప్పటివరకు ఏ టాటా కారులోనూ లేనంత పెద్ద స్క్రీన్. సేఫ్టీ విషయంలో కూడా హారియర్ ఈవీ ఏ మాత్రం వెనుకబడలేదు. దీనికి భారత్ ఎన్‌సీఏపీ నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది.