Renault : రెనాల్ట్ సంస్థ భారతీయ మార్కెట్ కోసం తన కొత్త వ్యూహాన్ని ప్రకటించింది. రాబోయే రెండేళ్లలో ఏకంగా 5 కొత్త మోడళ్లను విడుదల చేయడానికి రెడీ అవుతోంది. అంతేకాకుండా, భారతదేశంలో ఒక కొత్త డిజైన్ స్టూడియోను కూడా ఏర్పాటు చేస్తోంది. చెన్నైలో ఏర్పాటు చేయనున్న ఈ రెనాల్ట్ డిజైన్ సెంటర్, యూరప్ వెలుపల కంపెనీ అతిపెద్ద డిజైనింగ్ స్టూడియో కావడం విశేషం.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ 5 కొత్త మోడళ్లలో సరికొత్త జనరేషన్ డస్టర్, దాని 7-సీట్ల వెర్షన్ బిగ్‌స్టర్ కూడా ఉన్నాయి. అయితే డస్టర్, బిగ్‌స్టర్‌లలో డీజిల్ ఇంజన్ వచ్చే అవకాశం లేనప్పటికీ, రెనో ఈ కొత్త SUVలను హైబ్రిడ్ ఇంజన్‌తో విడుదల చేసే అవకాశం ఉంది. రెనో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో వెంకటరామ్ మామిళ్లపల్లె స్వయంగా తమ లైనప్‌లో హైబ్రిడ్‌ను చేర్చనున్నట్లు సంకేతాలిచ్చారు. అంతేకాకుండా, సీఎన్జీ, హైబ్రిడ్‌తో సహా అనేక ప్రత్యామ్నాయాలను పరిశీలించడానికి రెనాల్ట్ ఆసక్తిగా ఉందని ఆయన ధృవీకరించారు.
Also Read : ఫైవ్ స్టార్ సేఫ్టీ.. తక్కువ ధర.. అమ్మకాల్లో ఇది రికార్డ్
ఒకప్పుడు సంచలనం సృష్టించిన డస్టర్.. మళ్లీ వస్తోంది. భారతదేశంలో మొట్టమొదటి కాంపాక్ట్ SUVగా 2012లో విడుదలైన రెనాల్ట్ డస్టర్ ఒకప్పుడు మార్కెట్‌లో తనదైన ముద్ర వేసింది. విడుదలైన కొద్ది కాలంలోనే ఇది ఎంతో ప్రజాదరణ పొందింది. అయితే ఆ తర్వాత మార్కెట్‌లోకి అనేక పోటీదారులు రావడంతో డస్టర్ అమ్మకాలు క్రమంగా తగ్గిపోయాయి. చివరికి 2022లో డస్టర్‌ను నిలిపివేయాల్సి వచ్చింది.
మరి ఈ కొత్త డస్టర్ ఎప్పుడు వస్తుందంటే.. మొదట్లో ఈ కొత్త SUVల కొన్ని మోడళ్లను ఈ సంవత్సరం చివరిలో దీపావళి నాటికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం కొత్త డస్టర్ ఇప్పుడు 2026 ప్రారంభంలో భారతదేశానికి రానుంది. అంతేకాకుండా, కొత్త తరం డస్టర్ హైబ్రిడ్ వెర్షన్ అదే సంవత్సరం చివరి నాటికి భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్‌లో రెనో ఇప్పటికే మూడవ తరం డస్టర్‌ను విక్రయిస్తోంది. ఇందులో స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ కూడా ఉంది.
రాబోయే అన్ని రెనాల్ట్ కార్లలో పెట్రోల్‌తో పాటు స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉండే అవకాశం ఉంది. స్ట్రాంగ్ హైబ్రిడ్‌తో పాటు రెనాల్ట్ రేంజ్ ఎక్స్‌టెండర్ టెక్నాలజీపై కూడా పనిచేస్తోంది. ఈ టెక్నాలజీలో ఒక కాంపాక్ట్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రైన్‌తో కలిసి పనిచేస్తుంది. దీంతో రాబోయే రెనాల్ట్ కార్లు మరింత శక్తివంతంగా, మైలేజీతో ఉండబోతున్నాయని ఆశించవచ్చు.
Also Read: చూస్తే వెంటనే కొనాలనిపించే ఈ కారు గురించి తెలుసా?