Hyundai Creta : భారత మార్కెట్లో మిడ్‌సైజ్ SUV విభాగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు హ్యుందాయ్ మరో కీలక అడుగు వేస్తోంది. ఇందులో భాగంగా కొత్త తరం హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta)ను కంపెనీ అభివృద్ధి చేస్తోంది. SX3 అనే కోడ్‌నేమ్‌తో తయారవుతున్న ఈ కొత్త మోడల్ ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోడ్ టెస్టింగ్‌లో కనిపించింది. తాజాగా దక్షిణ స్పెయిన్‌లో ఈ SUV టెస్ట్ మ్యూల్ మరోసారి కెమెరాలకు చిక్కింది. వేడి వాతావరణ పరిస్థితుల్లో వాహనం పనితీరును పరీక్షించడంతో పాటు, వెనుక భాగంలో టోయింగ్ డైనోను అమర్చడం ద్వారా అధిక లోడ్‌లో వాహనం సామర్థ్యాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
బాక్సీ క్యామో తొలగింపు.. డిజైన్‌పై స్పష్టత
ఇప్పటివరకు కొత్త క్రెటా ముందు, వెనుక భాగాలను బాక్సీ క్యామోతో పూర్తిగా కప్పి రోడ్ టెస్టింగ్ చేస్తూ కనిపించింది. అయితే తాజా స్పై షాట్లలో ఆ బాక్సీ క్యామోను తొలగించి కేవలం క్యామో ర్యాప్‌తోనే వాహనం కనిపించింది. దీంతో SUV డిజైన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి.
కొత్త క్రెటా హ్యుందాయ్ తాజా ‘ఆర్ట్ ఆఫ్ స్టీల్’ డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా SUVకు మరింత షార్ప్, యాంగ్యులర్ లైన్లు, నిటారుగా ఉండే ఫ్రంట్ ఫాసియా, బాక్సీ సిల్హౌట్ అందిస్తున్నారు.
ముందుభాగంలో H-ఆకారంలో ఉండే టాప్-మౌంటెడ్ LED DRLs, వాటితో పాటు LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఉండే అవకాశం ఉంది. కొత్త గ్రిల్, స్లాటెడ్ ఎలిమెంట్స్‌తో కూడిన భారీ బంపర్ కూడా కనిపించనుంది. సైడ్ ప్రొఫైల్‌లో స్లాంటెడ్ రూఫ్‌లైన్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, గుండ్రటి వీల్ ఆర్చ్‌లు, స్పోర్టీ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉండనున్నాయి.
వెనుక భాగంలో రూఫ్ స్పాయిలర్, రేక్డ్ విండ్‌షీల్డ్, ఫ్లాట్ బూట్ లిడ్, చంకీ బంపర్ ప్రధాన ఆకర్షణలుగా ఉండనున్నాయి. ముందు DRLsకు సరిపోయేలా H-ఆకారపు టెయిల్ ల్యాంప్స్‌ను అందించే అవకాశం ఉంది.
SDVగా మారనున్న క్రెటా
డిజైన్‌తో పాటు టెక్నాలజీ విషయంలోనూ కొత్త క్రెటాలో భారీ మార్పులు ఉండనున్నాయి. ముఖ్యంగా ఈ SUVని Software Defined Vehicle (SDV)గా మారనుంది. అంటే వాహనం జీవితకాలంలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల ద్వారా కొత్త ఫీచర్లు, పనితీరు మెరుగుదలలను పొందే అవకాశం ఉంటుంది. హార్డ్‌వేర్ మార్పులు లేకుండానే OTA అప్‌డేట్ల ద్వారా ఫీచర్లను అప్‌డేట్ చేయవచ్చు.
అదే సమయంలో Pleos Connect సిస్టమ్ కూడా కొత్త క్రెటాలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌కు సంబంధించిన ఫంక్షన్లను ఒకే సెంట్రల్ స్క్రీన్‌లో సమీకరించే విధంగా ఈ సిస్టమ్ రూపొందుతోంది. స్టీరింగ్ వెనుక డ్యాష్‌బోర్డ్‌పై సన్నని డిజిటల్ డిస్‌ప్లే ఉండి, వేగం, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి కీలక సమాచారాన్ని చూపించనుంది.
హైబ్రిడ్ ఇంజిన్.. eAWD కూడా!
కొత్త తరం క్రెటాలో అత్యంత కీలకమైన మార్పుల్లో ఒకటి స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్. గ్లోబల్ మార్కెట్లలో 1.6-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ GDI పెట్రోల్ ఇంజిన్‌తో హైబ్రిడ్ సెటప్ ఉండే అవకాశం ఉంది. వేరియంట్‌ను బట్టి ఒకటి లేదా రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉండవచ్చు. డ్యూయల్ మోటార్ వెర్షన్‌లో eAWD సిస్టమ్ కూడా లభించే అవకాశం ఉంది.
2WD వెర్షన్ సుమారు 154 PS పవర్‌ను, eAWD వెర్షన్ 178 PS కంబైన్డ్ పవర్‌ను అందించే అవకాశం ఉంది. V2L (Vehicle-to-Load), రీజనరేటివ్ బ్రేకింగ్, AI ఆధారిత వాయిస్ కమాండ్స్ వంటి ఫీచర్లు కూడా కొత్త క్రెటాలో చేరే అవకాశం ఉంది.
భారత మార్కెట్ కోసం మాత్రం 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆధారంగా ప్రత్యేక స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను హ్యుందాయ్ తీసుకురావచ్చని సమాచారం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంజిన్ ఆప్షన్లు కూడా కొనసాగించే అవకాశం ఉంది.
ఎప్పుడు లాంచ్?
కొత్త తరం హ్యుందాయ్ క్రెటా మిడ్‌సైజ్ SUV మార్కెట్లో టెక్నాలజీ, డిజైన్ పరంగా కొత్త ప్రమాణాలను నెలకొల్పే లక్ష్యంతో వస్తోంది. ప్రస్తుతం రోడ్ టెస్టింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ SUV 2026 చివర్లో లేదా 2027లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే హ్యుందాయ్ నుంచి అధికారిక లాంచ్ తేదీ, ధర, పూర్తి స్పెసిఫికేషన్లపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.