New Cyber Scam 2025 Merge Call: సైబర్ దొంగల కుట్రలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ‘మెర్జ్ కాల్ స్కామ్’ అనే కొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్ గురించి అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, ఒక్క ఫోన్ కాల్ తో మీ జేబు ఖాళీ అవుతుంది. అది ఎప్పుడు, ఎలా, ఎక్కడ నుంచి జరిగిందో కూడా మీకు తెలియదు. అర్థం కాదు కూడా. ఇలాంటి ఈ స్కామ్ గురించి పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందామా?
మెర్జ్ కాల్ స్కామ్ అంటే ఏమిటి?
మోసగాళ్ళు మొదట మీకు నకిలీ సాకుతో కాల్ చేస్తారు. “మీ KYC అసంపూర్ణంగా ఉంది”, “డెలివరీ నిలిచిపోయింది” లేదా “వారు బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నారు” వంటివి చెప్పి మీకు కాల్ వస్తుంది. మీరు కాల్‌లో మాట్లాడుతున్నప్పుడే అతను మిమ్మల్ని మరొక నంబర్ నుంచి ‘కస్టమర్ కేర్’ లేదా ‘బ్యాంక్ మేనేజర్’కి కనెక్ట్ చేయమని అడుగుతాడు. నిజానికి, ఈ రెండవ వ్యక్తి కూడా ఒక స్కామర్. కాల్‌లను కాన్ఫరెన్స్ పెట్టి ముగ్గురు వ్యక్తుల మధ్య సంభాషణ అవుతుంటుంది.
బాధితులు ఎలా అవుతున్నారు?
మొదట మీరు భయం లేదా దురాశ కు గురి అవుతారు. వారు చెప్పినట్టు చేయకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందని లేదా “మీపై ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని చెబుతారు. సరిగ్గా ఈ సమయంలోనే మీ బ్యాంక్ వివరాలు, యూపీఐ పిన్, ఓటీపీ వంటి వివరాలు అడుగుతారు. కొన్నిసార్లు మీ వాయిస్ రికార్డ్ చేసి బ్యాంక్ వాయిస్ వెరిఫికేషన్ వంటి సేవలలో ఉపయోగించాలి అని కూడా చెబుతారు. అన్ని విధాలుగా మిమ్మల్ని నమ్మిస్తారు.
ఈ మోసం ఎందుకు అంత ప్రమాదకరమైనది?
మీ రికార్డ్ చేసిన వాయిస్‌ని ఉపయోగించి నకిలీ లావాదేవీలు చేయవచ్చు. మీ సిమ్‌ను డీయాక్టివేట్ చేయవచ్చు. లేదా వేరొకరి పేరుకు బదిలీ చేయవచ్చు. మోసగాళ్ళు వాట్సాప్ యాక్సెస్ పొందవచ్చు. మీ పేరు మీద ఆన్‌లైన్‌లో రుణాలు తీసుకోవచ్చు.
మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి?
తెలియని నంబర్ల నుంచి వచ్చే ఏవైనా కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి. నేను మిమ్మల్ని బ్యాంకు లేదా కస్టమర్ కేర్‌కు కనెక్ట్ చేస్తున్నాను అని ఎవరైనా చెబితే, వెంటనే కాల్‌ను డిస్‌కనెక్ట్ చేయండి. మేము బ్యాంక్ అధికారులం అని చెప్పినా సరే మీ సెన్సిటివ్ విషయాలను అంటే యూపీఐ, కార్డ్ నెంబర్, ఓటీపీ వంటి వాటిని అసలు పంచుకోవద్దు.
Also Read: Spam Calls: పదే పదే స్పామ్ కాల్స్ వస్తున్నాయా.. ఎవరు చేస్తున్నారో తెలుసుకోండి
స్కామ్ అని అర్థం అయితే ఏం చేయాలి?
వెంటనే కాల్ డిస్‌కనెక్ట్ చేయండి. మీ ఖాతాను బ్లాక్ చేయడానికి మీ బ్యాంకుకు తెలియజేయండి. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1903 కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి. [https://cybercrime.gov.in](https://cybercrime.gov.in) ని విజిట్ చేసి ఆన్‌లైన్ ఫిర్యాదును దాఖలు చేయండి. సమీపంలోని సైబర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి FIR దాఖలు చేయండి. మెర్జ్ కాల్ స్కామ్ లక్ష్యం మీ సమాచారాన్ని దొంగిలించడం మాత్రమే కాదు. మీ గుర్తింపు, మీ పొదుపులు, మీ ఆన్‌లైన్ భద్రతకు హాని కలిగించడం కూడా. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా తెలియని కాల్‌కు తెలివిగా స్పందించండి. ఎందుకంటే నేటి కాలంలో, ఒక్క కాల్ మీరు కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.