Telangana Thalli Statue Controversy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కొన్నింటిని మార్పు చేసింది. రిజిస్ట్రేషనల్‌లో టీఎస్ స్థానంలో టీజీ తీసుకువచ్చింది. తెలంగాణ గేయంగా జయజయహే తెంగాణను అధికారికంగా గుర్తించింది. ఇక తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మార్పులు చేసింది. సచివాలయం ఎదుట ప్రతిష్టించింది. ఇప్పుడు ఈ విగ్రహాలనే అన్ని కలెక్టరేట్‌ల ఎదుట ప్రతిష్టించాలని నిర్ణయించింది. అయితే దీనిపై విపక్ష బీఆర్‌ఎస్ మండిపడుతోంది.
తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టరేట్ల వద్ద తెలంగాణ తల్లి కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు రూ.5.77 కోట్లు కేటాయించగా, సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 9న విగ్రహాలను ఆవిష్కరించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నిర్ణయం వెనుక రాజకీయ, సాంస్కృతిక ఉద్దేశాలతో పాటు ఆర్థిక లెక్కలు, ప్రజల స్పందనపై చర్చ జరుగుతోంది.
భారీగా ఖర్చు..
తెలంగాణ తల్లి విగ్రహాలను 12 అడుగుల ఎత్తుతో రూపొందించనున్నారు. ఒక్కో విగ్రహ ఏర్పాటుకు సుమారు రూ.17.5 లక్షలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. 33 జిల్లాలకు కలిపి మొత్తం రూ.5.77 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఈ ఖర్చులో విగ్రహ నిర్మాణం, స్థాపన, ఆవిష్కరణ కార్యక్రమాలు వంటి అంశాలు ఉన్నాయి. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 9న ఈ విగ్రహాలను ఆవిష్కరించాలని నిర్ణయించారు. ఈ తేదీ ఎంపిక రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యతను సూచిస్తుంది.
అన్ని కలెక్టరేట్‌లలో..
రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ విగ్రహాలు ఏర్పాటు కానున్నాయి, దీనివల్ల తెలంగాణ తల్లి చిహ్నం ప్రజలకు దగ్గరవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ తల్లి రాష్ట్ర సాంస్కృతిక, భావోద్వేగ చిహ్నం. ఈ విగ్రహాల ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గుర్తింపును, స్వాభిమానాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ నిర్ణయం వెనుక రాజకీయ ఉద్దేశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అంత ఖర్చు సమంజసమేనా?
రూ.5.77 కోట్ల బడ్జెట్‌తో 33 విగ్రహాలను ఏర్పాటు చేయడం ఆర్థికంగా సమంజసమేనా అనే చర్చ జరుగుతోంది. ఒక్కో విగ్రహానికి రూ.17.5 లక్షల ఖర్చు అనేది నాణ్యమైన నిర్మాణం, డిజైన్, స్థాపనకు సరిపోతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఈ నిధులను విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల వంటి ఇతర అత్యవసర రంగాలకు ఉపయోగించవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. విగ్రహాల ఏర్పాటు స్థానిక కళాకారులకు, నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది. అలాగే, ఈ చిహ్నాలు దీర్ఘకాలంలో సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించవచ్చు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల అవసరాలను దృష్టిలో ఉంచుకుంటే, ఈ ఖర్చు అతిగా ఉందని కొందరు భావిస్తున్నారు. అలాగే, రాజకీయ నాయకుల పేర్లతో ఈ కార్యక్రమాన్ని ముడిపెట్టడం వివాదాస్పదంగా మారవచ్చు.
ప్రజల్లో కన్‌ఫ్యూజన్..
తెలంగాణలో మొదట ఏర్పడిన బీఆర్‌ఎస్ అలియాస్ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేసింది. కొన్నింటిని పార్టీ తరఫున ఏర్పాటు చేయగా, కొన్ని ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేశారు. ఏడాది క్రితం వరకు ఆ విగ్రహాన్నే తెలంగాణ తల్లిగా కొలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ తల్లి రూపం మార్చింది. సామాన్యులను ప్రతిభింభించేలా విగ్రహం ఉండాలని కొత్త రూపం ఇచ్చారు. అయితే తాము అధికారంలోకి వచ్చాక పాత విగ్రహాలను మారుస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. దీంతో ప్రజలోల కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. ఈ విగ్రహ రాజకీయాలేంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు నిర్ణయం సాంస్కృతిక, రాజకీయ కోణాల నుంచి గుర్తింపు పొందే అవకాశం ఉన్న చర్య. రూ.5.77 కోట్ల బడ్జెట్‌తో 33 జిల్లాల్లో 12 అడుగుల విగ్రహాలను స్థాపించే ఈ ప్రణాళిక రాష్ట్ర గౌరవాన్ని ఆవిష్కరించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ రాజకీయ సందేశాన్ని ప్రజలకు చేర్చేందుకు ఉద్దేశించింది. అయితే, ఆర్థిక ప్రాధాన్యతలు, రాజకీయ ఉద్దేశాలపై ప్రజల నుంచి వచ్చే స్పందన ఈ ప్రాజెక్టు విజయాన్ని నిర్ణయిస్తుంది.