https://oktelugu.com/

Mutual Funds : మ్యూచ్ వల్ లో.. “ఫండంటి” రాబడికి..

ఏ పెట్టుబడిపై అయినా వచ్చే రాబడులు కనీసం ద్రవ్యోల్బణంకన్నా ఎక్కువగా ఉండాలి. అలాగే ఎంత వరకు నష్టభయాన్ని తట్టుకోగలమనే విషయం కూడా ప్రధానం. మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులకూ ఇది వర్తిస్తుంది.

Written By:
  • Rocky
  • , Updated On : July 21, 2023 / 08:04 PM IST
    Follow us on

    Mutual Funds : ప్రస్తుతం బ్యాంక్‌ డిపాజిట్‌ రేట్లు అంత ఆకర్షణీయంగా లేవనే  చెప్పవచ్చు.  ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు చాలా మంది. కాస్త ఎక్కువ రిటర్నులను ఇచ్చే స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులకు అవకాశం ఉన్నప్పటికీ సరైన అవగాహన లేకపోతే చేతులు కాలే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. నోట్ల రద్దు తర్వాతి నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌పై ఇన్వెస్టర్లలో ఆసక్తి మరింతగా పెరిగిపోయింది. ఆదాయాలు పెరుగుతున్న నేపథ్యంలో  మ్యూచువల్‌ ఫండ్స్‌పై మరింత ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే చాలా మందికి మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఎన్ని రకాలు ఉంటాయి, వాటిలో పెట్టుబడులకు సంబంధించిన విషయాలపై ప్రాథమిక అవగాహన ఉండదు.
    ఫండ్స్‌ రకాలు
    మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే ఏ ఇన్వెస్టర్‌ అయినా ముందుగా వాటి పెట్టుబడుల స్వరూప, స్వభావాల గురించి అర్థం చేసుకోవాలి. ఈక్విటీ ఫండ్స్‌ అనేవి కంపెనీల ఈక్విటీ షేర్లలో, డెట్‌ ఫండ్స్‌ అనేవి ప్రభుత్వ, కార్పొరేట్‌ రుణ పత్రాల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. క్యాష్‌ లేదా లిక్విడ్‌ ఫండ్స్‌ అనేవి అవసరమైనప్పుడు వెంటనే నగదుగా మార్చుకునేందుకు వీలుగా స్వల్పకాలిక రుణ పత్రాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. గోల్డ్‌ ఫండ్స్‌ అయితే పసిడి మార్కెట్లోనే ఇన్వెస్ట్‌ చేస్తాయి.
    రిస్క్‌
    ఏ రకమైన ఆస్తిలో పెట్టుబడి పెట్టినా ఎంతో కొంత రిస్క్‌ అనేది ఉంటుందన్న విషయం తెలిసిందే. మ్యూచువల్‌ ఫండ్స్‌కు కూడా ఇది వర్తిస్తుందని గమనించాలి. ఈక్విటీ పథకాలైతే వాటి రాబడులు స్టాక్‌ మార్కెట్‌ పనితీరుపై ఆధారపడి ఉంటాయి. డెట్‌ ఫండ్స్‌ అయితే వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాతే మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు ముందుకు వెళ్లాలి.
    ఫండ్స్‌ ఎంపిక  
    సంపాదనలో ఎంతో కొంత మిగులు నిధులను ఏదో ఒక ఆస్తిలో పెట్టుబడిగా పెడితేనే ఆ సొమ్ము విలువ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. చేతిలో ఉన్న నగదును ఇంట్లోనే దాచిపెట్టుకుంటే దానికి భద్రత ఉంటుందేమోగానీ దాని విలువ మాత్రం ఎంత మాత్రం పెరగదన్న విషయాన్ని గుర్తించాలి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే పొదుపు చేసిన డబ్బు విలువ క్రమంగా తగ్గిపోతుంది. ఏ పెట్టుబడిపై అయినా వచ్చే రాబడులు కనీసం ద్రవ్యోల్బణంకన్నా ఎక్కువగా ఉండాలి. అలాగే ఎంత వరకు నష్టభయాన్ని తట్టుకోగలమనే విషయం కూడా ప్రధానం. మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులకూ ఇది వర్తిస్తుంది.