Snoring : బాధించే గురక.. ఇలా చేస్తే దరిచేరదిక

సాంబికస్‌, టి.ఎం.వి, లామ్నోమైనరా, ఆర్సనిక్‌ ఆల్బ్‌ వంటి మందులు గురకను తగ్గించడంలో బాగా తోడ్పడతాయి. కాకపోతే హోమియో వైద్యుల పర్యవేక్షణలోనే వాటిని తీసుకోవాలి.

Written By: Bhaskar, Updated On : July 21, 2023 8:10 pm
Follow us on

Snoring : ఏవ్యాధి అయినా ఆ రోగిని మాత్రమే వేధిస్తుంది. గురక సమస్య వేరు. గురకపెట్టే వ్యక్తి ఇంట్లో ఒకరుంటే చాలు ఇంటిల్లి పాదీ జాగారం చేయాల్సిందే. స్లీప్‌ అప్నియా సమస్య అంటూ లేకపోతే కుటుంబ సభ్యులందరికీ నిద్రపట్టకుండా చేసి తాము మాత్రం గురకపెడుతూ హాయిగా నిద్రపోతారు. చూడటానికి అమానుషంగా అనిపిస్తుంది కానీ, వాళ్లు మాత్రం ఏంచేస్తారు? అది వాళ్ల చేతుల్లో లేని పని.
స్లీప్‌ అప్నియా
మనం ఊపిరి తీసుకునే సమయంలో కొండనాలుక, దాని వెనుక ఉండే కండరాలు కదులుతాయి. దానివల్ల చిన్న  శబ్దం  వస్తుంది. దీన్నే మనం గురక అంటాం. గురక పెట్టేవారందరికీ స్లీప్‌ అప్నియా సమస్య ఉండనవసరం లేదు. అయితే టాన్సిల్స్‌లో సమస్యలు ఉన్నప్పుడు ఎడినాయిడ్స్‌ తలెత్తినప్పుడు గురక కాస్తా అప్నియాగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే, అప్నియాకు దారితీసే అంశాలే గురకకూ కారణమవుతాయి. నిద్ర సమయంలో ఎవరికైనా  దేహక్రియలు  తమ సహజ వేగాన్ని కోల్పోతాయి. దీనికి తోడు సైనసైటిస్‌, రైనైటిస్‌, స్థూలకాయం, టాన్సిల్స్‌. ఎడినాయిడ్స్‌ సమస్యలు కూడా ఉంటే మరికొన్ని ఇతర  ఇబ్బందులు  కూడా తోడవుతాయి. ప్రత్యేకించి శ్వాస క్రియలో ఆటంకం ఏర్పడే స్లీప్‌ అప్నియా సమస్య మొదలవుతుంది. జీవప్రక్రియల వేగం పడిపోవడం వల్ల శ్వాస మందగించి కొన్ని క్షణాల పాటు నిలిచిపోవడం అందరిలోనూ ఉండేదే. అయితే ఇది అంత  పెద్ద సమస్య కాదు. కానీ, స్లీప్‌ అప్నియా సమస్య ఉంటే 10 నుంచి 15 సెక న్ల దాకా శ్వాస ఆగిపోవచ్చు. దీనివల్ల హఠాత్తుగా మెలకువ వచ్చి లేచి కూర్చుంటారు. ప్రతి పది నిమిషాలకూ ఈ అనుభవమే ఎదురై  రాత్రంతా నిద్రకు దూరమవుతారు.
కారణాల్లో కొన్ని…
 గొంతులో అన్నవాహిక, శ్వాస నాళం పక్కపక్కనే ఉంటాయి ఏ కారణంగానైనా వీటి పక్కన ఉండే కండరాలు బలహీనపడితే గురక పెద్దదవుతుంది. ముక్కుదూలంలో సమస్యలున్నా గురక తద్వారా స్లీప్‌ అప్నియా బాధిస్తాయి.
టాన్సిల్స్‌ సమస్యలు, ముక్కుకూ గొంతుకూ మధ్య పెరిగే ఎడినాయిడ్స్‌,  సైనసైటిస్‌ లాంటివి ఊపిరి తీసుకోవడంలో ఆటంకం కలిగిస్తాయి. ఇలా శ్వాసక్రియకు ఏ చిన్న అవరోధం ఉన్నా అది గురకకు, స్లీప్‌ అప్నియాకు దారి తీస్తుంది.
మద్యపానం వల్ల దేహక్రియలు నిద్రలో తక్కువగా సాగుతాయి. ఫలితంగా శ్వాసక్రియలోనూ లోపాలు ఏర్పడతాయి. ముక్కు లోపలి భాగంలో కణుతులు ఏర్పడినప్పుడు అవసరమైన ఆక్సిజన్‌ అందదు. థైరాయిడ్‌ గ్రంథి తక్కువగా పనిచేసినప్పుడు కూడా స్లీప్‌ అప్నియా రావచ్చు.
హోమియోతో అప్నియా దూరం
శ్వాసనాళాలను తెరిచి ఉండే కృత్రిమ యంత్రాలు ఏ రోజుకారోజు తోడ్పడతాయే తప్ప అవి శాశ్వత పరిష్కారం కాదు. హోమియోలో  మూలకారణాన్ని తొలగిస్తారు. స్లీప్‌ అప్నియాకు కారణమైన ఆటంకమే గురకకీ కారణమవుతుంది. అందుకే ఆ కారణాన్ని తొలగించే దిశగా హోమియో ప్రయత్నిస్తుంది. సైనసైటిస్‌, ఎడినాయిడ్స్‌, థైరాయిడ్‌ సమస్యల వల్ల ఎదురయ్యే స్లీప్‌ అప్నియాను తగ్గించాలంటే ఆయా జబ్బులకు మందులు వాడాల్సి ఉంటుంది. స్థూలకాయమే సమస్యకు కారణమైతే  స్థూలకాయాన్ని తగ్గించడం తప్ప మరో దారి లేదు. సైనసైటిస్‌, పాలిప్స్‌, ఎడినాయిడ్స్‌ కారణంగా వచ్చే గురక అయితే తొందరగానే తగ్గిపోతుంది. ఒకవేళ సమస్య వారసత్వంగా వస్తుంటే అది అంత తొందరగా తగ్గదు. హోమియో మందుల్ని ఎక్కువ కాలం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పెద్దవాళ్లల్లో కన్నా చిన్న పిల్లల్లో ఉండే గురక సమస్య చాలా తొందరగా తగ్గుతుంది. సాంబికస్‌, టి.ఎం.వి, లామ్నోమైనరా, ఆర్సనిక్‌ ఆల్బ్‌ వంటి మందులు గురకను తగ్గించడంలో బాగా తోడ్పడతాయి. కాకపోతే హోమియో వైద్యుల పర్యవేక్షణలోనే వాటిని తీసుకోవాలి.