https://oktelugu.com/

Career Counselling : కెరియర్‌ కౌన్సెలింగ్‌: మీ విజయానికి ‘విలువైన’ సోపానాలివే

కొంతమంది ఎంత కష్టపడినప్పటికీ విజయం సాధించలేకపోతుంటారు. ఇలాంటప్పుడు వారిలో అసహనం పెరిగిపోతుంది. అంతేకాదు చీటికిమాటికి చిరాకు పడుతుంటారు.

Written By:
  • Rocky
  • , Updated On : July 21, 2023 / 07:58 PM IST
    Follow us on

    Career Counselling : విజయం సాధిస్తే వచ్చే కిక్కే వేరు. విజేతలకు సమాజం ఇచ్చే గౌరవం వేరు. కానీ అందరూ విజేతలు కాలేరు. కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం ఉంటుంది. కొంతమంది ఎంత కష్టపడినప్పటికీ విజయం సాధించలేకపోతుంటారు. ఇలాంటప్పుడు వారిలో అసహనం పెరిగిపోతుంది. అంతేకాదు చీటికిమాటికి చిరాకు పడుతుంటారు. ఇలా వరుసగా ఓటములు ఎదురవుతుండడంతో, వారి మీద వారికే నమ్మకం సడలిపోతుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? బయట చాలామంది చాలా చెబుతుంటారు. అలాంటప్పుడు మనసు మీద ఏకాగ్రత కుదరక విజయానికి దగ్గర కాలేరు. నిరాశ, నిస్పృహలోనే జీవితం సాగిస్తుంటారు. ఇలాంటివారు ఏం చేస్తే విజయం సాధిస్తారో.. ఎలాంటి పద్ధతులు అవలంబిస్తే “విజయ”లక్ష్మి మనసు చూరుగొంటారో.. ఈ కథనంలో చూద్దాం.
    ఆ విమర్శల్లో వాస్తవికత ఎంత?
    మీరేదైనా పని చేపట్టి దాన్ని విజయవంతం చేయలేకపోయారా? ఎదుటి వాళ్లంతా అదే పనిగా మీ పైన విమర్శల్ని ఎక్కుపెడుతున్నారా? అయితే విమర్శల్ని ఆహ్వానించాల్సిందే! కానీ, ఆ విమర్శల్లోని వాస్తవికత ఎంత? సత్యశీలత లేని విమర్శల్ని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ విమర్శించినవారు అంతకు ముందు ఎప్పుడైనా మిమ్మల్ని ప్రశంసించారా? నిజానికి ప్రశంసించలేని వారికి విమర్శించే అర్హత కూడా ఉండదు. ఏ సమాజంలోనైనా, విజయాల్ని ప్రశంసించే వాళ్లు చాలా తక్కువ. ఎందుకంటే అలా ప్రశంసించడం ద్వారా తాము తక్కువైపోతామన్న భావన వారిలో ఉంటుంది. అందుకే ఓడిపోయినప్పుడు విరుచుకుపడేవాళ్లు, “నువ్వు గెలిచినప్పుడు” మౌనంగా ఉండిపోతారు. ఒకవేళ మాట్లాడినా ‘అదేమంత గొప్ప!’ అంటూ పెదవి విరిచేస్తారు.
    విజయాలకు సమయం కావాలి
    తొలి ప్రయత్నంతోనే విజయం రావడం అనేది ఎప్పుడో అరుదుగా తప్ప జరగదు. ఎన్నో వైఫల్యాల తర్వాత గానీ, ఒక్క విజయం చేతికి రాదు. కానీ, లోకం తీరు వేరు. అది మీ తొలి ప్రయత్నమే అయినా,  విమర్శకుల నాలుకలు విరుచుకుపడకుండా ఉండవు. ఇదొక్కటే కాదు. ఇలాంటి సంఘటనలే ఇంకా ఎన్నో ఎదురవుతాయి. అవన్నీ వాళ్ల వ్యక్తిత్వ స్థాయిని చెబుతాయి. వాళ్లంతా ఏమంటున్నారనేది ప్రధానం కాదు. వాటికి మీరు ఎలా స్పందిస్తున్నారనేది ముఖ్యం. మీరు ఎదుటి వాళ్ల వ్యవహారశైలిని నియంత్రించలేకపోవచ్చు. ఆ శక్తి మీలో లేదు.  కానీ, మీ ప్రతిస్పందనను మీరు నియంత్రించుకోగలరు. ఆ శక్తి మీలో ఉంది.
    మీరు ఇచ్చేదే విలువ!
    ఏ విషయమైనా  దానికదిగా  ఎలా ఉంటుందనేది ప్రామాణికం కాదు. మనం దాన్ని ఎలా చూస్తున్నామన్న దాని మీద.. ఎలా స్వీకరిస్తున్నామన్న దాని మీద దాని విలువ ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఎవరైనా తాము వెళుతున్న మార్గాన్ని తీవ్రంగా ఖండిచారనుకోండి. ఆ ఖండనకు గురైన వారిలో కొందరు ఆగ్రహానికి గురవుతారు,  కొందరు ఆ ఖండనకు బాధపడతారు. మరికొందరేమో  అసలు పట్టించుకోరు. ఖండన ఒకటే కానీ, దానికి ఒక్కొక్కరు ఒక్కోలా ప్రతిస్పందిస్తారు. అందుకే, మీ పరిధిలో దేని విలువైనా మీరు ఇచ్చే దాన్ని బట్టే ఉంటుంది. ఏ సంఘటనైనా మనల్ని తీవ్రమైన క్షోభకు గురిచేస్తోందీ అంటే ఆ శక్తిని మీరే దానికి ఇచ్చావని అర్థం. ఆ సంఘటనను మీకు మీరు ఎలా అన్వయించుకుంటున్నావన్నదాని మీదే  అది మీ మీద ప్రభావం చూపడం ఉంటుంది. నిప్పు  గడ్డి మీద పడితే కాలిపోతుంది. అదే రాయిమీద పడితే గడ్డికేమీ కాదు  నిప్పే చల్లారిపోతుంది. అందుకే మనిషి గడ్డిలా  కాకుండా రాయిలా ఉండాలి. ఎవరైనా తమ ఆలోచనా వైఖరిని దృఢంగా మార్చుకుంటే స్థితిగతులు మారిపోతాయి.  మొత్తంగా జీవితమే మారిపోతుంది. మానవ జీవితాల్లోని అద్భుతాలన్నీ ఏ సంఘటనల మీద ఎలా స్పందిస్తావన్న దానిమీదే ఎక్కువగా ఆధారపడి ఉంటాయనేది వాస్తవం.