https://oktelugu.com/

Maruti Suzuki: పాకిస్తాన్ కారు ఇండియాలో .. టయోటా, సుజుకి కలిసి చేస్తున్న మ్యాజిక్ ఇదేనా?

Maruti Suzuki సుజుకి ఈ-ఎవ్రీ (e-Every) కమర్షియల్ ఎలక్ట్రిక్ వ్యాన్‌ను మొదటిసారిగా 2023లో G7 హిరోషిమా శిఖరాగ్ర సమావేశంలో ప్రోటోటైప్‌గా ప్రదర్శించారు. దీనిని అదే సంవత్సరం విడుదల చేయాలని యోచించారు.

Written By: , Updated On : March 30, 2025 / 11:00 PM IST
Maruti Suzuki

Maruti Suzuki

Follow us on

Maruti Suzuki: మన దేశంలో మారుతి సుజుకిగా ప్రసిద్ధి చెందిన జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ సుజుకి మోటార్స్ త్వరలో కొత్త, చౌకైన ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది. విశేషమేమిటంటే.. ఈ కారు ప్రపంచ మార్కెట్‌లో విడుదలైన తర్వాత భారతీయ మార్కెట్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సుజుకి విడుదల చేయబోయే కారు పెట్రోల్ వెర్షన్ ఇప్పటికే పాకిస్తాన్‌లో ఎవ్రీ పేరుతో అమ్ముడవుతోంది. రాబోయే కారు దాని ఎలక్ట్రిక్ వెర్షన్ అయ్యే ఛాన్స్ ఉంది.

సుజుకి ఈ-ఎవ్రీ (e-Every) కమర్షియల్ ఎలక్ట్రిక్ వ్యాన్‌ను మొదటిసారిగా 2023లో G7 హిరోషిమా శిఖరాగ్ర సమావేశంలో ప్రోటోటైప్‌గా ప్రదర్శించారు. దీనిని అదే సంవత్సరం విడుదల చేయాలని యోచించారు. అయితే ఆలస్యమైంది. సుజుకి అధికారికంగా 2025లో ఈ-ఎవ్రీ ఎలక్ట్రిక్ కమర్షియల్ వ్యాన్ విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ లభించింది.

సుజుకి ప్రస్తుతం తన స్వదేశీ మార్కెట్, పాకిస్తాన్ వంటి కొన్ని ఎంపిక చేసిన మార్కెట్లలో పెట్రోల్‌తో నడిచే ఎవ్రీ కమర్షియల్ వ్యాన్‌ను విక్రయిస్తోంది. దీనికి సమానమైన మోడల్‌ను ఇండియాలో ఓమ్ని పేరుతో విక్రయించారు. అయితే, ఈ రెండు వ్యాన్‌లు చాలా భిన్నంగా ఉంటాయి. ఈ-ఎవ్రీ ఎలక్ట్రిక్ కమర్షియల్ వ్యాన్ విషయానికి వస్తే ఇది చూడటానికి దాదాపు పెట్రోల్ వెర్షన్ ఎవ్రీ లాగే ఉంటుంది. ఇందులో ఫ్రంట్-బంపర్-మౌంటెడ్ ఛార్జింగ్ పోర్ట్ వంటి కొన్ని ఈవీ ప్రత్యేక మార్పులు మాత్రమే ఉంటాయి.

సుజుకి ఈ-ఎవ్రీ ఎలక్ట్రిక్ కమర్షియల్ వ్యాన్‌లో పెద్ద విండ్‌స్క్రీన్, ఫ్లాట్ ఫ్రంట్ ఫేసియా, ట్రాపెజోయిడల్ హెడ్‌ల్యాంప్‌లు, నిలువు, సమాంతర చారలతో బాక్సీ ప్రొఫైల్ ఉంటుంది. ఈ వ్యాన్‌లో స్లైడింగ్ డోర్‌లు ఉంటాయి. ఎలక్ట్రిక్ కారు 3,395 మిమీ పొడవు, 1,475 మిమీ వెడల్పు ఉంటుంది. ఈ వ్యాన్‌లో ప్రయాణికులకు తగినంత హెడ్‌రూమ్ లభిస్తుంది. సుజుకి ఎవ్రీ వ్యాన్‌లో పెద్ద బూట్ స్పేస్ కూడా ఉంటుంది. ఈ కారు రేంజ్ 200 కిమీ వరకు ఉండవచ్చు.

సుజుకి ఎవ్రీ లాంటి మోడళ్లను టయోటా పిక్సస్, డైహత్సు హిజెట్ పేరుతో కూడా విక్రయిస్తోంది. సుజుకి లాగానే టయోటా , డైహత్సు కూడా జపనీస్ ఆటోమొబైల్ తయారీ సంస్థలు. వీటిని కూడా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్, లింక్డ్ సిస్టమ్‌లను ఈ మూడు కార్ల కంపెనీలు కలిసి అభివృద్ధి చేశాయి. ఈ కారులో టయోటా ఎలక్ట్రిఫికేషన్ టెక్నాలజీ , సుజుకి, డైహత్సు చిన్న కార్ల రూపకల్పన, తయారీ టెక్నాలజీని అందించాయి.