https://oktelugu.com/

Taxpayers: 47,674 మంది ట్యాక్స్‌ పేయర్స్‌ మాయం.. ఎన్ని కోట్లు ఎగ్గొట్టారో తెలుసా?

Taxpayers భారత దేశంలో ధనవంతుల్లో చాలా మంది ట్యాక్స్‌(Tax)ఎగ్గొట్టేందుకే ప్రయత్నిస్తుంటారు. దీనికి అనేక మార్గాలు అన్వేషిస్తుంటారు. అయితే ప్రభుత్వం కూడా పన్ను పరిధిలోకి వచ్చేవారంతా పన్ను చెల్లించాలన్న లక్ష్యంతో అనేక చర్యలు తీసుకుంటోంది. అయినా తాజాగ లెక్కల ప్రకారం 47,674 మంది ట్యాక్స్‌ పేయర్స్‌(Tam payers) పన్ను ఎగ్గొట్టి మాయమయ్యారు.

Written By: , Updated On : March 31, 2025 / 12:00 AM IST
Taxpayers

Taxpayers

Follow us on

Taxpayers: భారత ఆదాయపు పన్ను శాఖలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు 47,674 మంది ట్యాక్స్‌ పేయర్స్‌ ఆచూకీ లేకుండా మాయమైనట్లు తెలుస్తోంది. వీరు రూ.5.91 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని పన్ను బకాయిలుగా చెల్లించకుండా ఉన్నారని సమాచారం. ఈ విషయం ఆర్థిక వ్యవస్థలో పెను సందడిని రేకెత్తిస్తోంది.
ఈ ట్యాక్స్‌ డిఫాల్టర్లు(Defalters) వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు, సంస్థలు కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. వీరు తమ ఆదాయ వివరాలను దాచిపెట్టడం లేదా పూర్తిగా కనుమరుగైపోవడం ద్వారా పన్ను చెల్లింపులను తప్పించినట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను శాఖ ఈ బకాయిలను వసూలు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఈ వ్యక్తుల ఆచూకీ కనిపెట్టడం పెద్ద సవాలుగా మారింది. ఈ ఘటన దేశంలో పన్ను విధానాల అమలు, పారదర్శకతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇంత పెద్ద సంఖ్యలో ట్యాక్స్‌ పేయర్స్‌ జాడ లేకుండా పోవడం వెనుక కుట్ర ఉందా లేక వ్యవస్థలోని లోపాలే కారణమా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు ఈ విషయంపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

పార్లమెంటులో చెప్పిన గణాంకాలు..
భారత ప్రభుత్వం పార్లమెంట్‌(Parlment)లో వెల్లడించిన ఆదాయపన్ను గణాంకాలు ఆశ్చర్యం కలిగించాయి. ప్రత్యక్ష పన్నుల్లో 47,674 మంది ట్యాక్స్‌ ఎగవేతదారుల ఆచూకీ తెలియక, వీరు చెల్లించాల్సిన బకాయిలు రూ.5.91 లక్షల కోట్లుగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. అదే విధంగా, పరోక్ష పన్నుల్లో 60,853 మంది ఎగవేతదారులు కనిపించకుండా పోయారని, వీరి బకాయిలు రూ.43,525 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి(Pankaj Choudary) రాజ్యసభకు ఈ వివరాలను లిఖితపూర్వకంగా సమర్పించారు.

ఎగవేతదారుల గుర్తింపు..
ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ఈ ఎగవేతదారులను గుర్తించేందుకు విస్తృత చర్యలు చేపట్టింది. వ్యక్తిగత లావాదేవీల సమాచారాన్ని సేకరించి, 360 డిగ్రీల కోణంలో ప్రొఫైళ్లను తయారు చేసి, ఫీల్డ్‌ యూనిట్ల(Field Units)కు పంపింది. ఈ ప్రక్రియ ద్వారా పన్ను చెల్లింపుదారులను గుర్తించి, బకాయిల వసూలుకు దారులు సుగమం చేస్తోంది. అటు పరోక్ష పన్నుల కేంద్ర మండలి కూడా బ్యాంక్‌ ఖాతాల(Bank Accounts) స్తంభన వంటి కఠిన చర్యలతో పన్ను వసూళ్లను వేగవంతం చేస్తోంది.

వ్యవస్థాగత లోపాలు..
ఈ భారీ ఎగవేత దేశ ఆర్థిక వ్యవస్థలో పన్ను విధానాల అమలుపై సీరియస్‌ ప్రశ్నలను లేవనెత్తుతోంది. దాదాపు ఒక లక్ష మంది ట్యాక్స్‌ పేయర్స్‌ ఆచూకీ లేకపోవడం, రూ.6 లక్షల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోవడం వ్యవస్థాగత లోపాలను సూచిస్తున్నాయి. ఈ బకాయిలు వసూలైతే ప్రభుత్వ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.