Journalist Annual Charges: మనిషి జీవితం స్మార్ట్ మయం అయిపోయింది కదా.. పత్రికలు ఎవరు చదువుతున్నారు? అంతా ఫోన్లోనే చూస్తున్నరు కదా? చివరికి వార్తలు రాసే విలేకరులు కూడా ఫోన్లోనే పేపర్ చదువుతున్నారు కదా. అలాంటప్పుడు పేపర్ అవసరం ఏంటి? పేపర్ తో పనేంటి?
అనే ప్రశ్నలు కామన్ రీడర్ల నుంచే కాదు.. రిపోర్టర్ల నుంచి కూడా ఎదురవుతున్నాయి. కాకపోతే యాజమాన్యాలు అడ్డగోలుగా సంపాదించాలంటే.. పేపర్ ను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాలంటే.. భౌతికంగా ప్రింట్ చేయాలి. నచ్చని వాళ్ళ మీద పేజీల కొద్దీ వార్తలు కుమ్మేసి జనాలకు పంచాలి. అందువల్లే యాజమాన్యాలు నష్టం వచ్చినప్పటికీ పేపర్ పబ్లిష్ చేస్తున్నామని బయటకి కలరింగ్ ఇస్తూ ఉంటాయి. రంగురంగుల పేజీల్లో అడ్డగోలుగా అబద్ధాలు ప్రచురిస్తూ.. గిట్టని పార్టీల మీద టన్నులకొద్దీ బురద చల్లుతూ ఉంటాయి. తెలుగు నాట ఈ పైత్యం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. ఒకరకంగా ప్రింట్ మీడియా కూడా వర్గాలుగా విడిపోయింది. ఒకప్పుడు ఎల్లో మీడియా అని ప్రధానంగా అనేవారు. ఇప్పుడు ఎల్లో మీడియాతో పాటు బ్లూ మీడియా, పింక్ మీడియా కూడా ఏర్పడిందని వ్యాఖ్యానిస్తున్నారు.. సరే ఏ పార్టీకి తగ్గట్టుగా మీడియా ఉంది. ఇందులో నిజాలు, అబద్ధాలు అనే విషయాలను పక్కన పెడితే జరిగే ప్రచారంలో ఎవరు గొప్పగా ప్రజెంట్ చేస్తే వారే తోపు.
Also Read: Telugu Newspaper: ఆ పత్రిక పని గోవిందా.. ముక్కీ మూలిగి అదే స్థానమే!
అడ్డగోలు సంపాదనకు అలవాటు పడి..
ఇక వర్గాలుగా విడిపోయిన మీడియాలో కూడా కాసుల కోసం కక్కుర్తి పడే యాజమాన్యాలు ఉన్నాయి. పైనుంచి వచ్చే సంపాదన.. అడ్డగోలుగా సంపాదించే సంపాదన కాకుండా.. విలేకరులను వేధించి.. ఇబ్బంది పెట్టి.. సంపాదించే యాజమాన్యం ఒకటి ఉంది. పేరు రాయడానికి ఇబ్బంది లేకపోయినప్పటికీ.. న్యాయపరంగా చిక్కులు ఎదురవుతాయి కాబట్టి.. ఈ కథనాన్ని పేరు ప్రస్తావించకుండానే రాయాల్సి వస్తోంది. ఇప్పుడు ఆ యాజమాన్యం ఏం చేసిందంటే.. కొద్దిరోజులుగా జిల్లాలలోని కార్యాలయాలలో ఆ యాజమాన్యం ఆధ్వర్యంలో పనిచేస్తున్న పెద్ద తలకాయలు జిల్లాల వారీగా సమావేశాలు నడుపుతున్నారు. విలేకరులందరినీ పిలిపించి.. మాట్లాడుతున్నారు. ” మన పత్రిక నెంబర్ వన్ స్థానంలోకి వెళ్లాలి. ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి మీరంతా కూడా ఈ క్రతువులో పాల్గొనాలి. ప్రతి ఏడాది సంవత్సర చందాలు మీరు గొప్పగా చేస్తున్నారు.. కాకపోతే ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ చేయాలి. పైగా మన పత్రికలో పేజీల సంఖ్య కూడా పెంచాం. అందువల్ల మీరు సంవత్సర చందాలు కట్టించాలి. గతంలో ₹1800 ఒక కాపీకి ఉండేది. 1600 సంవత్సర చందా పోనూ మీ కమిషన్ గా 200 ఇచ్చేవాళ్లం. అయితే ఇప్పుడు మేనేజ్మెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. సంవత్సర చందా కాపీని 1600 చేసింది. ఇందులో మీ వాటాగా 200 కమిషన్ వస్తుంది. మిగతా 1400 ఒక కాపీకి చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ కాపీలు చేసిన విలేకరులకు బహుమతులు అందిస్తాం. తక్కువ కాపీలు చేస్తే ఆ విలేఖరిపై చర్యలు తీసుకుంటాం” ఇదీ క్లుప్తంగా ఆయా సమావేశాలలో బ్రాంచ్ మేనేజర్లు, బ్యూరో ఇన్చార్జిలు, ఎడిషన్ ఇన్చార్జిలు విలేకర్లకు చేస్తున్న సూచనలు.
వార్తల్లో దమ్ము ఉండొద్దా..
దైనిక్ భాస్కర్, జాగరణ్, టైమ్స్ ఆఫ్ ఇండియా, మలయాళ మనోరమ, మాతృభూమి, దిన తంతి.. మనదేశంలో టాప్ పత్రికలు ఇవి. ఇందులో తెలుగు పత్రికలు లేవు. ఉండే అవకాశం లేదు.. ఎందుకంటే పై పత్రికలు కొంతలో కొంత జర్నలిజాన్ని ప్రదర్శిస్తుంటాయి. విలేకరులను సంవత్సర చందాలు చేయాలని, ప్రకటనలు తీసుకురావాలని ఇబ్బంది పెట్టవు. పైగా వారు వార్తలు రాసిన దానికి తగ్గట్టుగానే లైన్ ఎకౌంట్ చెల్లిస్తుంటాయి. తెలుగు నాట ఒక్క పత్రిక మినహా మిగతావన్నీ అత్యంత దరిద్రం. వాటి మేనేజ్మెంట్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది . సంవత్సర చందాలు, ప్రకటనలు, ఇతరత్రా పనికిమాలిన వ్యవహారాలకు విలేకరులను ఉపయోగించుకుంటూ నరకం చూపిస్తున్నాయి.. పోనీ డెస్క్ లలో పనిచేసే వారికి ఏమైనా గొప్ప జీతాలా.. అంటే అది కూడా లేదు. పైగా వారితో వెట్టి చాకిరీ చేయించుకోవడంలో ఆ మేనేజ్మెంట్లు ఒక మెట్టు పైనే ఉంటాయి. కరోనా సమయంలో అడ్డగోలుగా ఉద్యోగులను తొలగించి వారి కుటుంబాల ఉసురు పోసుకున్నాయి. అప్పటిదాకా వారితో చాకిరి చేయించుకొని.. తీరా ఆపత్కాలంలో వదిలించుకున్నాయి.
Also Read: Telugu News Paper : మరింత పాతాళంలోకి.. ఆ పత్రిక పాత్రికేయాన్ని మరింత దిగజార్చింది..
సామూహికంగా సిగ్గుపడదాం
పత్రికకు నేటి కాలంలో అంతగా ఆదరణ లేదు. పత్రికలు చదివే వారు కూడా అంతగాలేరు. మరి ఇలాంటి కాలంలో పత్రికలు ఎవరు కొంటారు? వారితో ఎవరి కొనుగోలు చేయిస్తారు? అసలు పత్రికలు బుక్ చేయాల్సిన కర్మ విలేకరులకు ఏంటి? పత్రికా యాజమాన్యానికి సర్కులేషన్ సిబ్బంది లేరా? విలేకరులు కాపీలు బుక్ చేస్తుంటే సర్కులేషన్ సిబ్బంది ఏం చేస్తున్నట్టు? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రశ్నలు.. అయినా ఆ సిగ్గుమాలిన యాజమాన్యానికి బుద్ధి ఉండదు. నీతి, రీతి అసలు ఉండదు. విలేకరులను వేధించి సంవత్సర చందాలు కట్టిస్తుంది. సంవత్సర ప్రకటనలు చేయిస్తుంది. తీరా వారి చేతిలో చిల్లి గవ్వ కూడా పెట్టదు. ఇట్లాంటి యాజమాన్యం విలువల గురించి చెబుతుంది. అట్లాంటి యాజమాన్యం తెలుగులో ఉన్నందుకు.. మరీ ముఖ్యంగా తెలుగు పత్రికను కొనసాగిస్తున్నందుకు సామూహికంగా సిగ్గుపడదాం.