Telugu Newspaper: కరోనా సమయంలో అడ్డగోలుగా ఉద్యోగులను రోడ్డుపాలు చేసి.. ఆ తర్వాత ఇప్పుడు అవసరాల దృష్ట్యా ఆ మేనేజ్మెంట్ కొత్త నోటిఫికేషన్లు జారీ చేస్తున్నది. ప్రింట్ మీడియాలో పీకుదామని.. పొడుద్దామని అంకమ్మ శివాలు ఎత్తుతున్నది. కానీ ఫీల్డ్ రియాలిటీ అలా లేదు. ఎందుకంటే పేపర్ కొని చదివే అలవాటు జనాలకు ఎప్పుడో తగ్గిపోయింది. స్థూలంగా చెప్పాలంటే తెలుగు అనేది భవిష్యత్తు కాలంలో మరుగున పడే భాషగా మారిపోతోంది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి గాని.. ఇప్పటికైతే ప్రింట్ మీడియా పరిస్థితి బాగోలేదు.. మరీ ముఖ్యంగా తెలుగు ప్రింట్ మీడియా పరిస్థితి ఏమాత్రం బాగోలేదు.. ఇప్పటికే పెద్ద పెద్ద మీడియా హౌసులు మొత్తం ప్రింటింగ్ తగ్గించుకుంటున్నాయి. ఏదో ఏబిసి లెక్కలు ఉండాలి కాబట్టి నడిపించుకుంటున్నాయి. ఎందుకంటే ఏ బీసీ ఉంటేనే ప్రభుత్వపరంగా ప్రకటనలు వస్తాయి. కార్పొరేట్ పరంగా యాడ్స్ వస్తాయి. అందువల్లే ఇష్టం లేకున్నా సరే ఏ బి సి కోసం సర్కులేషన్ లెక్కలను చూపిస్తున్నాయి.
తెలుగులో ఓ పత్రికా మేనేజ్మెంట్ ఇటీవల పేజీల సంఖ్యను పెంచింది. ఉపసంపాదకులను కూడా నియమించుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. సర్కులేషన్ పెరగాలని.. అనుకున్న స్థానానికి చేరిపోవాలని ఆ పత్రిక అధిపతి ఇటీవల కాలికి బలపాలు కట్టుకుని జిల్లాలు మొత్తం తిరిగారు. కానీ సాడ్ రియాలిటీ ఏంటంటే.. ఇవాల్టికి ఆ పేపర్ సర్క్యులేషన్లో గ్రోత్ లేదు. అనుకున్న రేంజ్ లో గణాంకాలు నమోదు కావడం లేదు. దీనంతటికీ కారణాలు అనేకం ఉన్నప్పటికీ.. ప్రధానంగా కనిపిస్తున్నది మాత్రం అత్యంత దారుణమైన సర్కులేషన్ వ్యవస్థ. అప్పట్లో ఓ పత్రిక మేనేజ్మెంట్.. ప్రకృతి విపత్తులు చోటు చేసుకున్నప్పుడు.. ఎలాగైనా సరే తన పేపర్ రాష్ట్ర మొత్తం సర్కులేట్ కావాలి అనే ఉద్దేశంతో.. ఏకంగా రైల్వే వ్యవస్థను వాడుకుంది. చివరికి పేపర్ పడేలా చేసింది. ఈ ఉదాహరణ చాలు సర్కులేషన్ ను ఆ పేపర్ మేనేజ్మెంట్ ఎలా కొనసాగిస్తుందో చెప్పడానికి.. కానీ ఈ స్థాయిలో వ్యవస్థ మనం చెప్పుకుంటున్న పత్రిక మేనేజ్మెంట్ కు లేదు. సర్కులేషన్ మేనేజర్లు సంవత్సరాలకు సంవత్సరాలుగా జిల్లాలలో పాతుకుపోయారు. పైగా వారికి ఫీల్డ్ రియాల్టీ తెలియదు. ఇవాల్టికి రిపోర్టర్లు, స్టాఫ్ రిపోర్టర్లు, బ్యూరో చీఫ్ లు కిందా మీదా పడి చందాలు కట్టిస్తే.. మహా అయితే ఒక నెల సక్రమంగా పేపర్ పడుతుంది. ఆ తర్వాత ఏమిరా కథ అంటే ఎప్పటి ఆటలాగే మారిపోతుంది. పేపర్ సక్రమంగా పడక.. డబ్బులు చెల్లించినా పట్టించుకునే దిక్కు దివాణం లేక పోవడంతో మొత్తంగా ఆ పత్రిక గమనమే ప్రశ్నార్థకంగా మారింది.
ఇప్పటికి కొన్ని జిల్లాల్లో 15 వేల లోపే సర్కులేషన్ ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాకపోతే రెండు రాష్ట్రాలలో కాస్త అనుకూలమైన వాతావరణం ఏర్పడింది కాబట్టి ఇబ్బంది రావడం లేదు. లేకపోతే ఇప్పటికే ఆ పత్రిక పరిస్థితి డిజిటల్ వైపు వెళ్లిపోయేది.. వచ్చే మూడేళ్లు ఇబ్బంది లేకపోయినప్పటికీ.. పరిస్థితి ఇలానే ఉంటే మాత్రం ఆ తర్వాత మాత్రం రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వాలు మారితే ఆ పత్రిక గమనం ఎలా ఉంటుందో మేనేజ్మెంట్ కు ఇప్పటికే ఒక క్లారిటీ ఉంది!