https://oktelugu.com/

Telugu News Paper : మరింత పాతాళంలోకి.. ఆ పత్రిక పాత్రికేయాన్ని మరింత దిగజార్చింది..

ఆ పత్రిక పాత్రికేయ ప్రమాణాలు దిగజారవు అనుకున్న ప్రతిసారీ.. అంతకంటే పాతాళానికి పంపించి చూపిస్తుంది. ఉదయం లేస్తే తెలంగాణ ప్రయోజనాలు..ఇంకా మన్నుమశానం అని చెప్పే ఆ పత్రిక..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 9, 2025 / 09:41 PM IST
    Follow us on

    Telugu News Paper :  ఊరంతా ఒకదారైతే.. ఉలిపి కట్టెది మరొక దారి.. ఈ సామెత అచ్చు గుద్దినట్టు ఆ పత్రికకు సరిపోతుంది. తెలంగాణలో 10 సంవత్సరాలపాటు అధికారాన్ని అనుభవించిన పార్టీకి ఆ పత్రిక కరపత్రం లాగా పనిచేసింది. ఇప్పటికీ అదే పని చేస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఆ రాజకీయ పార్టీకి బాకా ఊదిన ఆ పత్రికకు.. ఇప్పుడు ప్రజాస్వామ్య విలువలు బాగా గుర్తుకొస్తున్నాయి. ప్రజల సమస్యలు కళ్ళకు కనిపిస్తున్నాయి. 10 సంవత్సరాలు అధికార పార్టీ భజన చేసిన ఆ పత్రిక.. ఇప్పుడు కొత్తగా ప్రజాస్వామ్య పుత్రిక అవతారం ఎత్తింది.. అయితే ఇందులోను కొత్త బెంచ్ మార్క్ సృష్టిస్తోంది.

    ఆ పత్రిక పాత్రికేయ ప్రమాణాలు దిగజారవు అనుకున్న ప్రతిసారీ.. అంతకంటే పాతాళానికి పంపించి చూపిస్తుంది. ఉదయం లేస్తే తెలంగాణ ప్రయోజనాలు..ఇంకా మన్నుమశానం అని చెప్పే ఆ పత్రిక.. ఆ దిశలో ఎన్నడూ వార్తలు రాయలేదు. రాసే అవకాశం కూడా లేదు. దానికి ఆస్తమానం పొలిటికల్ వాసనలే. కేవలం ఆ పార్టీ ప్రయోజనాలు మాత్రమే. చివరికి ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తే.. ఆ కోణంలో ఒక్క వార్తను కూడా రాయలేకపోయింది. చివరికి ఆప్ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిందని ఓ చిన్నపాటి శీర్షిక పెట్టి వార్తను ప్రచురించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలోనూ ఆ పత్రిక ఇలాంటి దిక్కుమాలిన ప్రమాణాలను పాటించింది. అసలు ఢిల్లీలో మద్యం కుంభకోణం జరగలేదని.. అందులో ఓ ఎమ్మెల్సీ పాత్ర అసలు లేదని కుండబద్దలు కొట్టింది. ఆ కాడికి ఈ పత్రిక దేశానికి సుప్రీంకోర్టు అయినట్టు బిల్డప్ ఇచ్చింది.

    తెలుగు నాట కొన్ని పత్రికలు రాజకీయ పార్టీలకు కొమ్ముకాస్తుంటాయి. కానీ కొన్ని వార్తల విషయంలో ఆ పత్రికలు ప్రమాణాలను పాటిస్తుంటాయి. కానీ ఈ పత్రిక మాత్రం ఏ కోశానా కూడా పాత్రికేయ ప్రమాణాలను పాటించదు. న్యూట్రల్ వార్తలను ప్రచురించే సాహసం చేయదు. ఆస్తమానం ఆ పత్రికకు ఆ పార్టీ ప్రయోజనాలు మాత్రమే కావాలి. ఆ పార్టీ వ్యవహారాలు మాత్రమే కావాలి. ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఇటీవల పొలిటికల్ కార్యక్రమం నిర్వహించినప్పుడు నాలుగు పేజీల నిండా వార్తలు రాసింది. ఆ కాడికి దేశంలో ఇంకేమి వార్తలు లేనట్టు.. బిల్డప్ ఇచ్చింది. వాస్తవానికి ఆ పత్రికను నడిపే రాజకీయ పార్టీని కార్నర్ చేసే విషయంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏమాత్రం ముందడుగు వేయడం లేదు. అందువల్లే ఆ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. ఆ పార్టీ అనుబంధంగా పనిచేసే ఈ పత్రిక అడ్డగోలుగా వార్తలు రాస్తోంది. పాత్రికేయ ప్రమాణాలను నడి బజారులో పడేస్తోంది. పైగా పాత్రికేయం గురించి సరికొత్త నిర్వచనాలు ఇస్తోంది.. ఒక పార్టీకి కొమ్ముకాస్తూ.. అధికారంలో ఉన్న పార్టీని విమర్శిస్తోంది.. కరపత్రిక అనే పదానికి మించి భజన చేస్తోంది.. ఇలాంటి పత్రిక పాత్రికేయ ప్రమాణాల గురించి చెప్పడం విడ్డూరానికే విడ్డూరం.