Marigold Farming: కొన్నేళ్ల క్రితం వరకు రైతులు సంప్రదాయ పంటలను ఎక్కువగా పండించేవారు. అయితే కాలం మారడం వల్ల ప్రస్తుతం రైతులు కొత్త పంటలపై దృష్టి పెట్టి ఆ పంటలతో భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. మార్కెట్ లో బంతిపూలకు (Marigold) ఎక్కువగా డిమాండ్ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేకుండా సులభంగానే బంతి పూలను సాగు చేసే అవకాశం అయితే ఉంటుంది.
జార్ఖండ్ కు చెందిన సుబోధ్ కుమార్ గోలా పూలసాగు ద్వారా ఆదర్శ రైతుగా మారారు. నాలుగు సంవత్సరాల క్రితం నుంచి బంతిపూల సాగు చేస్తున్నానని చెబుతున్నారు. ఐదు ఎకరాల భూమిలో బంతి పూలను సాగు చేయడం ద్వారా మంచి లాభాలను సొంతం చేసుకుంటున్నానని సుభోద్ కుమార్ చెప్పుకొచ్చారు. బంతి పూలలో హజారా మేరిగోల్డ్ ఒక రకం అని ఒక మొక్క 1,000 పూలను ఉత్పత్తి చేస్తుందని సుభోద్ కుమార్ తెలిపారు.
కోల్ కతా నుంచి తాను మొక్కలను కొనుగోలు చేస్తానని ఒక్కో మొక్కకు 15 రూపాయలు ఖర్చైందని సుభోద్ కుమార్ అన్నారు. పూల సాగుకు ఆవు పేడను వినియోగించడంతో ఎరువుల ఖర్చు తగ్గిందని సుభోద్ కుమార్ పేర్కొన్నారు. ఆవు పేడను ఎక్కువగా వినియోగిస్తే పూలు మెరిసిపోతాయని బంతి పూల సాగు చేయాలంటే మూడు నుండి నాలుగు సార్లు దున్నాలని సుభోద్ కుమార్ వెల్లడించారు.
కూరగాయల సాగుతో పోలిస్తే శ్రమ తక్కువని నీటి వినియోగం కూడా తక్కువని సుభోద్ కుమార్ అన్నారు. స్థానికంగా ఈ పంటకు మార్కెట్ లేకపోయినా ఈ పంట ద్వారా సంవత్సరానికి లక్ష రూపాయలకు పైగా సంపాదిస్తున్నానని మార్కెట్ ఉంటే మరింత ఎక్కువ మొత్తం సంపాదించవచ్చని సుభోద్ కుమార్ తెలిపారు.