iQOO Pad Ultra : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి మరో ఫ్లాగ్‌షిప్ టాబ్లెట్ మార్కెట్లోకి రాబోతోంది. iQOO Pad Ultra పేరుతో వస్తుందని భావిస్తున్న ఈ టాబ్లెట్‌ను కంపెనీ చైనాలో ఈ నెలాఖరులో విడుదల చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో iQOO 16 సిరీస్‌ను కూడా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అధికారిక విడుదలకు ముందే iQOO Pad Ultra గీక్‌బెంచ్ బెంచ్‌మార్క్ వెబ్‌సైట్‌లో కనిపించింది. దీంతో టాబ్లెట్‌కు సంబంధించిన కీలక హార్డ్‌వేర్, పనితీరు వివరాలు వెలుగులోకి వచ్చాయి.
గీక్‌బెంచ్‌లో iQOO Pad Ultra
Geekbenchలో iPA2691 మోడల్ నంబర్‌తో Vivo టాబ్లెట్ ఒకటి కనిపించింది. లిస్టింగ్‌లో టాబ్లెట్ పేరు స్పష్టంగా పేర్కొనకపోయినా, ఇదే మోడల్ నంబర్ గతంలో చైనా SRRC సర్టిఫికేషన్ డేటాబేస్‌లో కనిపించింది. ఆ సమయంలో దీనిని రాబోయే iQOO Pad Ultraతో అనుసంధానించారు.
గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం ఈ టాబ్లెట్‌లో SM8975 చిప్‌సెట్ ఉండనుంది. ఇది Qualcommకు చెందిన తదుపరి తరం Snapdragon 8 Elite Extreme Gen 6 ప్రాసెసర్ కావచ్చని అంచనా వేస్తున్నారు.
5.01GHz వరకు CPU క్లాక్ స్పీడ్
లిస్టింగ్ ప్రకారం ఈ చిప్‌సెట్‌లో మొత్తం 8 CPU కోర్లు ఉంటాయి. వీటిలో మూడు కోర్లు 3.74GHz, మరో మూడు కోర్లు 4.03GHz, రెండు హై-పెర్ఫార్మెన్స్ కోర్లు ఏకంగా 5.01GHz వరకు క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తాయని తెలుస్తోంది. గ్రాఫిక్స్ కోసం Adreno 850 GPU ఉండనున్నట్లు సమాచారం.
16GB RAM.. Android 17!
Geekbenchలో పరీక్షించిన iQOO Pad Ultraలో 15.20GB RAM ఉన్నట్లు నమోదైంది. సాధారణంగా 16GB RAM వేరియంట్‌లో సిస్టమ్ కొంత మెమరీని ఉపయోగించుకోవడంతో బెంచ్‌మార్క్‌లో 15.20GBగా కనిపించే అవకాశం ఉంది. దీంతో మార్కెట్లో ఈ టాబ్లెట్‌ను 16GB RAM వేరియంట్‌గా తీసుకురావచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ డివైజ్ Android 17 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తున్నట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ వెల్లడించింది.
గీక్‌బెంచ్ స్కోర్ ఎంతంటే?
Geekbench 7.0.0 Android AArch64 పరీక్షలో iQOO Pad Ultra సింగిల్-కోర్‌లో 1,512 పాయింట్లు, మల్టీ-కోర్‌లో 6,770 పాయింట్లు సాధించింది.
అయితే ఈ స్కోర్లు కొత్త తరం ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ నుంచి ఆశించే స్థాయితో పోలిస్తే తక్కువగానే కనిపిస్తున్నాయి. దీనికి కారణం టాబ్లెట్ ఇంకా ప్రీ-రిలీజ్ దశలో ఉండటం లేదా ఫైనల్ కాకపోయిన ఫర్మ్‌వేర్‌పై పనిచేస్తుండటం కావచ్చని భావిస్తున్నారు.
iQOO 16తో పోల్చితే స్కోర్లు తక్కువే.. కానీ
ఇదే తరం Qualcomm చిప్‌సెట్‌ను ఉపయోగిస్తుందని భావిస్తున్న iQOO 16 కూడా గతంలో Geekbenchలో కనిపించింది. ఆ లిస్టింగ్‌లో iQOO 16 సింగిల్-కోర్‌లో 3,434, మల్టీ-కోర్‌లో 9,334 పాయింట్లు సాధించింది.
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. iQOO 16 స్కోర్లు Geekbench 6.7.1 ద్వారా నమోదవగా, iQOO Pad Ultra స్కోర్లు Geekbench 7.0.0 ద్వారా నమోదయ్యాయి. కాబట్టి ఈ రెండు బెంచ్‌మార్క్ ఫలితాలను నేరుగా పోల్చడం సరైనది కాదు.
సెప్టెంబర్ 29న లాంచ్ అయ్యే అవకాశం
iQOO Pad Ultraకు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుత సమాచారం ప్రకారం సెప్టెంబర్ 29న iQOO 16తో పాటు iQOO Pad Ultraను చైనాలో విడుదల చేసే అవకాశం ఉంది. లాంచ్ సమయంలో డిస్‌ప్లే, బ్యాటరీ, ఛార్జింగ్, కెమెరా, ధర వంటి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.