Kunal Shah: కుటుంబ వ్యాపారం దివాళా తీయడంతో.. పూట గడవడం కోసం డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా, ఇంట్లో సరుకుల కోసం సరుకులు డెలివరీ చేసే బాయ్‌గా పనిచేశాడు. కుటుంబాన్ని గట్టెక్కించడానికి చదువుకుంటూనే పనిచేశాడు. కానీ తర్వాత అతను సృషించిన చరిత్ర సంచలనంగా మారింది. తన తొలి స్టార్టప్‌ని వేల కోట్ల రూపాయలకు అమ్మినప్పుడు దేశమంతా నోరెళ్లబెట్టింది. ‘క్రెడ్’ని బిలియన్ డాలర్ల కంపెనీగా తీర్చిదిద్దినప్పుడు అంకుర సంస్థల ఔత్సాహికులకు రోల్ మోడల్ అయ్యాడు. ఇటీవల వ్యాపార వేత్త సంజీవ్ బిక్ చందానీ అతని గురించి చెప్పినప్పుడే దేశం మొత్తం అతన్ని హీరోగా చూసింది. అతడెవరో కాదు స్టార్టప్ ప్రపంచ రారాజు కునాల్ షా. స్టార్టప్‌లో ఇతని పేరు తెలియని వారు ఉండరు. మాటల మాత్రికుడు అయిన కునాల్ తన సృజనాత్మక ఆలోచనలను వేల కోట్ల రూపాయల పెట్టుబడిగా మార్చాడు. విజయవంతమైన స్టార్టప్ సంస్థల వ్యవస్థాపకుల్లో చాలా మంది ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఐఐఎంలలో చదవిన వాళ్లేఉంటారు. కానీ కునాల్‌ది మామూలు నేపథ్యం. ఫిలాసఫీలో డిగ్రీ చేశాడు. ఇంటర్‌లోనూ అరకొర మార్కులే. దీంతో పార్ట్‌టైం జాబ్ చేయడానికి అనువుగా ఈ కోర్సు ఎంచుకున్నాడు.
వ్యాపారిగా..
వ్యాపార కుటుంబంలో పుట్టడం, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పుట్టి పెరగడంతో వ్యాపారం అతని రక్తంలో ఉండిపోయింది. తన ఆలోచనలను డబ్బులుగా మలిచే కళ చిన్నతనం నుంచే అబ్బింది. దెబ్బతిన్న కుటుంబానికి అండగా నిలవడానికి అనేక కష్టాలు పడ్డాడు. రెండు గంటలే కాలేజీకి వెళ్తూ మిగతా సమయం డబ్బు సంపాదనకే వెచ్చించాడు. ఆ సమయంలో సీడీలు అమ్మాడు. అమ్మాయిల చేతులకు మెహందీలు పెట్టాడు. సైబర్ కేఫ్‌లు నడిపాడు. కంప్యూటర్ ఆపరేటర్‌గా, డెలివరీ బాయ్‌గా, డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా 20 రకాల పనులు చేశాడు. ఏ పని చేసినా మెదడుకు పదును పెట్టే పని మాత్రం మానలేదు.
తొలి స్టార్టప్‌తోనే సూపర్ హిట్..
ఎన్నో కష్టాలు పడి కాస్త స్థిరపడ్డాక 2009లో హైసా బ్యాక్ స్టార్టప్ ప్రారంభించాడు. ఇది డిస్కౌంట్ కూపన్లు అందించే సంస్థ తొలి ప్రయత్నమే మంచి సక్సెస్ కావడంతో తర్వాత ఏడాది సందీప్ టాండన్‌తో కలిసి ప్రీచార్జ్ కి ఊపిరులూదాడు. ఆన్‌లైన్‌లో తేలిగ్గా అన్నికకాల బిల్లులు చెల్లించడం, సెల్‌ఫోన్‌ని రీచార్జి చేసుకోవడం లాంటి ఆప్షన్లు ఉండేవి. ఇందులో ఊహించనంతగా సక్సెస్ సాధించాడు. తక్కువ కాలంలోనే మిలియన్ల కొద్దీ యూజర్లుగా మారారు. 2015లో ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ప్రీచార్జ్‌ని రూ.3.5 వేల కోట్లకు కొనేసింది. అప్పట్లో వ్యాపారవర్గాల్లో ఈ ఒప్పందం ఒక సంచలనం. దీంతో కునాల్‌పేరు దేశమంతా మార్మోగింది.
డిజిటల్ పేమెంట్ విప్లవం..
తర్వాత అవకాశాల కోసం కొన్ని రోజుల వేచి చూశాడు. తర్వాత డిజిటల్ పేమెంట్ విప్లవాన్ని అందిపుచ్చుకునేలా 2018లో ‘క్రెడ్’ని ప్రారంభించాడు. ఇప్పుడు చాలా మందికి క్రెడ్ ఫిన్‌టెక్ యాప్ గురించి తెలిసే ఉంటుంది. బిల్లు కట్టినప్పుడు, రీచార్జ్ చేసినప్పుడు.. మనకి కొద్ది మొత్తంలో క్యాష్‌బ్యాక్ అందుతుంటుంది. ఈ రివార్డ్స్ బేస్ట్ పేమెంట్ యాప్ కొద్దికాంలోనే భారత్ లోని మేటి ఫైనాన్షియల్ యాప్‌లలో ఒకటిగా నిలిచింది. దీనిని దేశంలోని కోటి మందికిపైగా యూజర్లు వాడుతున్నారు. మొత్తం క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల్లో 20 శాతం దీని ద్వారానే జరుగుతున్నాయి. ఇది ప్రస్తుతం రూ.18 వేల కోట్ల టర్నోవర్ సాధించింది. సంస్థ స్థిరపడడానికి తను ఎంతలా కష్టపడతాడంటే క్రెడ్‌ని లాభాల బాట పట్టించే వరకు నెలకు రూ.15 వేల జీతమే తీసుకునేవాడు.
కష్టాల నుంచి ఎదిగిన కునాల్‌కి సమాజానికి తీపి పంచడం తెలుసు. వేల కోట్లు పోగేసుకోవడమే తెలుసు. అందులోనుంచి కొంత సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చించడమూ తెలుసు. ఎంత బిజీగా ఉన్నా.. తరిక చేసుకుని మరీ యువత కోసం మోటివేషన్ ఉపన్యాసాలు ఇస్తుంటాడు. తన ఆలోచనలను ఇతరులతో పంచుకుంటాడు. మంచి బిజినెస్ మోడల్‌తో వస్తున్న స్టార్టప్‌లు ఎదగాలనే ఉద్దేశంతో 200 వరకు స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడి పెట్టాడు. వ్యాపార దిగ్గజాల వారసుడు కాకపోయినా ఇంతలా వ్యాపారా పాఠాలు ఒంట పట్టించుకున్నాడు. అందుకు వినియోగదారుల నాడి పట్టుకోవడమే ప్రధాన కారణం.