Hyundai HE1i electric car: రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరల వల్ల సామాన్యుడి నెలవారీ బడ్జెట్ తలకిందులవుతోంది. ప్రస్తుతం పెట్రోల్ కారులో ఒక కిలోమీటర్ ప్రయాణించాలంటే సుమారు రూ. 7 నుంచి రూ.9 వరకు ఖర్చవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని హ్యుందాయ్ కంపెనీ కొత్తగా ఎలక్ట్రిక్ SUV కారును తీసుకురాబోతుంది. ఈ కారు ఒక కిలోమీటర్ ప్రయాణానికి కేవలం 80 పైసల నుంచి రూ. 1.20 మాత్రమే ఖర్చవుతుందని అంచనా. అంటే, పెట్రోల్ కారుతో పోలిస్తే దాదాపు 80% వరకు ఇంధన ఖర్చులను ఆదా చేసుకోవచ్చు. ఇది ఉద్యోగులకు, వ్యాపారవేత్తలకు మరియు ప్రతిరోజూ సిటీలో ప్రయాణించే వారికి ఒక గొప్ప వరంగా మారుతుంది. ఈ కారు గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల(EV)కు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ (Hyundai ‘HE1i’) అనే కోడ్ పేరుతో ఒక కొత్త ఎలక్ట్రిక్ మైక్రో SUVని రూపొందిస్తోంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ ఎక్స్టర్ (Exter)మోడల్‌ను పోలి ఉంటుందని అంచనా.
హ్యుందాయ్ ఈ ‘HE1i’ ఎలక్ట్రిక్ కారును సామాన్యులకు అందుబాటులో ఉండేలా ‘బడ్జెట్’ ధరలో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.10 లక్షల నుండి రూ.15 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది టాటా పంచ్ ఈవీ (Tata Punch EV) వంటి కార్లకు గట్టి పోటీని ఇవ్వనుంది. ప్రభుత్వం ఇచ్చే ఫేమ్ (FAME) సబ్సిడీలు కూడా తోడైతే, ఈ కారు ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది.
ఎలక్ట్రిక్ కార్లలో వినియోగదారులు ప్రధానంగా చూసేది రేంజ్. హ్యుందాయ్ HE1i లో సుమారు 25 kWh నుండి 30 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను వాడే అవకాశం ఉంది. దీనివల్ల ఈ కారు ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 300 కిలోమీటర్ల నుండి 350 కిలోమీటర్ల వరకు మైలేజీని (రేంజ్) ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. సిటీ లోపల ప్రయాణాలకు, అప్పుడప్పుడు చేసే చిన్నపాటి లాంగ్ జర్నీలకు ఈ మైలేజీ సరైనది.
హ్యుందాయ్ HE1i కేవలం బడ్జెట్ కారుగానే కాకుండా, ఆధునిక ఫీచర్లతో రాబోతోంది. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్ మరియు కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఈ కారు 2026 చివరిలో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. భారీ పెట్రోల్ ఖర్చుల నుండి విముక్తి పొందాలనుకునే వారికి హ్యుందాయ్ ‘HE1i’ ఒక పవర్‌ఫుల్ అండ్ ఎకనామికల్ ఆప్షన్ కానుంది.
