Honda Shine 100: భారతదేశంలో యాక్టివా, షైన్ వంటి ప్రముఖ టూ-వీలర్‌లను విక్రయించే హోండా ఇప్పుడు ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేస్తోంది. హోండా ఈ బైక్‌ను మరికొన్ని నెలల్లో భారత మార్కెట్లో రిలీజ్ చేయనుంది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిళ్లలో ఒకటైన హోండా షైన్ 100 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. జపనీస్ కంపెనీ హోండా ఇటీవల ఈ బైక్ డిజైన్ కోసం పేటెంట్ దాఖలు చేసింది. దీని వల్ల బైక్ డిజైన్, టెక్నాలజీకి సంబంధించిన కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. మార్కెట్‌లో చాలా తక్కువ ధరలో ఎలక్ట్రిక్ బైక్‌ను తీసుకురావడానికి హోండా రెడీ అవుతుందని, ఇది ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో కంపెనీ పట్టును మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో స్కూటర్లు ఎక్కువగా ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, ఓడిసి మోటోకార్ప్, టీవీఎస్, బజాజ్ వంటి కంపెనీలు సేల్స్ పరంగా మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇటీవల కంపెనీలు ఈ సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను కూడా తీసుకురావడంపై దృష్టి సారిస్తున్నాయి. అయితే, పాత కంపెనీలు ఇప్పటివరకు ఈ విభాగంలో తమ పట్టును సాధించలేకపోయాయి. ఓలా కొన్ని నెలల క్రితం ఓలా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ బైక్‌ను రిలీజ్ చేసింది. దాని డెలివరీలు కూడా మొదలయ్యాయి.
Also Read: తరచుగా రాష్ట్రాలు మారుతున్నారా? అయితే మీ కారుకు BH సిరీస్ నంబర్ ప్లేట్ తప్పనిసరి!
హోండా దాఖలు చేసిన పేటెంట్ డిజైన్, మీడియాలో వచ్చిన ఫోటోల ఆధారంగా, రాబోయే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ డిజైన్, టెక్నాలజీ గురించి అనేక కీలక సమాచారం అందింది. హోండా షైన్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేస్తే, ఈ విభాగంలో పెట్రోల్, ఎలక్ట్రిక్ రెండింటిలోనూ లభించే మొదటి బైక్ ఇదే అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను షైన్ 100 తక్కువ ఖర్చుతో కూడిన ఛాసిస్ పై నిర్మిస్తారు. హోండా షైన్ ప్రతేడాది లక్షలాది యూనిట్లు అమ్ముడవుతుంది. అంతేకాకుండా, బైక్‌లో ఇంజిన్ ఉన్న చోట ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చుతారు. ఇది ఎలక్ట్రిక్ యాక్టివా లాగా రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌తో రావచ్చని అంచనా.
హోండా తన ఎలక్ట్రిక్ బైక్‌లో మార్చగలిగే బ్యాటరీ ప్యాక్‌ను ఇవ్వొచ్చు. హోండా ఇప్పటికే తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హోండా ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి వివరాలను వెల్లడించనప్పటికీ, ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను పూర్తిగా కొత్తగా తయారు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఉన్న షైన్ 100 ప్లాట్‌ఫారమ్‌లో చిన్న మార్పులు చేసి ఈ బైక్‌ను విడుదల చేయవచ్చు. కాబట్టి వచ్చే ఏడాది లోపు ఎప్పుడైనా దీనిని లాంచ్ చేసే అవకాశం ఉంది.