BH Series Number Plate: ఉద్యోగరీత్యా తరచుగా రాష్ట్రాలు మారాల్సి వస్తుందా.. లేదా రెండు మూడేళ్లకోసారి ఉద్యోగంలో ట్రాన్సఫర్లు అవుతున్నాయా ? అయితే మీ కారుకు BH సిరీస్ నంబర్ ప్లేట్ తీసుకోవడం చాల బెటర్. అసలు ఈ బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ అంటే ఏమిటి? దీని వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ నంబర్ ప్లేట్ ఎవరికి ఇస్తారు అనే వాటి గురించి వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం. ఈ నంబర్ ప్లేట్ వల్ల మీ ప్రయాణం చాలా ఈజీగా ఉంటుంది.
భారత ప్రభుత్వం 2021 ఆగస్టులో ఈ బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్‌ను ప్రవేశపెట్టింది. ఇది ప్రత్యేకంగా ప్రైవేట్ వాహనాల కోసం రూపొందించబడింది. కొత్తగా కొనుగోలు చేసే ప్రైవేట్ వాహనాలకు మాత్రమే ఈ నంబర్ ప్లేట్ ఇస్తారు. కమర్షియల్ వెహికల్స్ కు ఈ నంబర్ ప్లేట్ ఇవ్వరు. ఈ నంబర్ ప్లేట్ మీద BH అనే ఆంగ్ల అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి. బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ ఫార్మాట్ ఇలా ఉంటుంది.. మొదట రిజిస్ట్రేషన్ జరిగిన సంవత్సరం (YY ఉదాహరణకు, ’23’ అంటే 2023). ఆ తర్వాత BH ఉంటుంది. దాని పక్కనే 4 అంకెల రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. చివరగా వాహన కేటగిరీని తెలిపే రెండు ఆంగ్ల అక్షరాలు (A నుంచి Z వరకు ఏదైనా). ఉదాహరణకు: 23 BH 6666 AE అని ఉంటుంది.
Also Read: బీ కేర్ ఫుల్ నా కొడకా.. ఈటల రాజేందర్ అన్నది ఎవరిని?
సాధారణ నంబర్ ప్లేట్ ఉన్న వాహనంతో మీరు ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి మారితే 12 నెలల్లోపు మీ వాహన రిజిస్ట్రేషన్‌ను కొత్త రాష్ట్రానికి మార్చాలి. అలా చేయకపోతే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది. దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే బీమా క్లెయిమ్‌లు కూడా రిజెక్ట్ అవుతాయి. అయితే, బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్‌తో మీకు ఈ సమస్యలు ఉండవు. ఈ నంబర్ ప్లేట్ దేశవ్యాప్తంగా చెల్లుతుంది. మీరు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు మీ వాహనాన్ని మళ్లీ రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు.
రిజిస్ట్రేషన్ మార్చాల్సిన అవసరం లేదు కాబట్టి, మీ కారు బీమా కవరేజ్, క్లెయిమ్ చెల్లుబాటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. సాధారణ నంబర్ ప్లేట్‌కు సాధారణంగా 15 సంవత్సరాలకు ఒకేసారి రోడ్డు ట్యాక్స్ చెల్లించాలి. కానీ బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్‌కు, మీరు ప్రతి రెండేళ్లకు ఒకసారి మాత్రమే రోడ్డు ట్యాక్స్ చెల్లిస్తే సరిపోతుంది. ఈ ట్యాక్స్ వెహికల్ ధర నుంచి జీఎస్టీని తొలగించిన తర్వాత లెక్క కడతారు. ఒకవేళ మీరు మీ వాహనాన్ని మరొక రాష్ట్రానికి చెందిన వ్యక్తికి అమ్మాలనుకుంటే, బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ దేశమంతటా చెల్లుతుంది కాబట్టి ఈజీగా అమ్మవచ్చు.
Also Read: రేవంత్ రెడ్డిపై పార్టీలో తొలి తిరుగుబాటు
2023లో పీఐబీ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. దేశంలోని 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో భారత సిరీస్ నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ సిబ్బంది, బ్యాంకు ఉద్యోగులు, అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఉద్యోగులు దీనికి అర్హులు. ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగుల విషయానికొస్తే.. వారి కంపెనీ ఆఫీసులు కనీసం నాలుగు రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో రిజిస్టర్ అయి ఉంటే వారు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా సులభం. మీరు ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంట్లో కూర్చొని రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. మీరు రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ వారి వాహన్ పోర్టల్లో లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా మీరు కారు కొనుగోలు చేసేటప్పుడు ఏదైనా ఆటోమొబైల్ డీలర్ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.