కరోనా నేపథ్యంలో బంగారం మెరుపులు జిగేల్ మన్నాయి. ఆల్ టైం హై రేట్లు నమోదు చేస్తూ.. తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.50 వేలు దాటిపోయింది. దీంతో.. ఈ రేటు ఇంకెంత పైకి వెళ్తుందోనని కళ్లప్పగించి చూశారు జనం, ఇన్వెస్టర్లు. అయితే.. కొంత కాలంగా ధర తగ్గుముఖం పట్టింది. అడపాదడపా నామమాత్రంగా పెరిగినట్టు కనిపిస్తున్నా.. మళ్లీ పడిపోతూనే ఉంది.
Also Read: అసోంలో అడ్డం తిరుగుతున్న బీజేపీ కథ..
ఇవాళ శుక్రవారం (12-03-21) ధరలు చూస్తే.. 22 క్యారెక్టర్ల తులం బంగారం 42,150 రూపాయల వద్ద ఉంది. 24 క్యారెక్టర్ల ధర 45,980 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే.. కరోనా సమయంలో ఎందుకు ధరలు ఆకాశాన్నంటాయి..? ఇప్పుడెందుకు ఇలా పడిపోతున్నాయి..? అనేది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. దానికి సమాధానాలు వెతికినప్పుడు పలు ఆన్సర్లు కనిపిస్తాయి.
ప్రధాన కారణం చూసినప్పుడు.. కరోనా సమయంలో ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. పనుల్లేక జనం ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో.. దేశాల ఆర్థిక వ్యవస్థలు మొత్తం క్షీణించిపోయాయి. డాలర్ తోపాటు అన్ని దేశాల కరెన్సీ విలువ తగ్గుతూ వచ్చింది. దీంతో.. పెట్టుబడి దారులు తమ డబ్బు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో బంగారం పెట్టుబడి పెట్టారు. అంటే.. తమ వద్ద ఉన్న డబ్బులతో బంగారం కొని దాచుకోవడం మొదలు పెట్టారు. ఇలా.. అందరూ ఒక్కసారిగా బంగారం కొనుగోలు చేయడంతో ధరలు భారీగా పెరుగుతూ పోయాయి.
Also Read: వైరల్: ఆస్పత్రి బెడ్ పై నుంచి మమతా బెనర్జీ వీడియో సందేశం
అయితే.. ఇప్పుడు పరిస్థితి మారింది. కొంతకాలంగా ప్రపంచ దేశాల్లో వ్యాక్సిన్లు వచ్చేశాయి. దీనివల్ల ప్రజల్లో కరోనా భయం తొలగిపోయే పరిస్థితి వచ్చింది. ఎవరి పనుల్లో వారు పడిపోయారు. దీంతో.. ఆర్థిక వ్యవస్థలన్నీ క్రమంగా పుంజుకుంటున్నాయి. దీంతో.. అప్పుడు బంగారం కొనుక్కుని దాచుకున్నవాళ్లంతా ఇప్పుడు అమ్మేస్తున్నారు. అమ్మేసి ఇతర మార్గాల్లో పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. ఇలా.. ఎక్కువ మంది బంగారం అమ్మకానికి మొగ్గుచూపడంతో డిమాండ్ తగ్గిపోయి, ధరలు తగ్గుతున్నాయన్నమాట.
ప్రపంచంలో ఇలాంటి కష్టకాలం వచ్చిన ప్రతిసారీ.. పెట్టుబడిదారులు బంగారాన్నే నమ్ముకుంటారు. ఒకసారి కాకపోయినా.. ఒకసారైనా ధరలు పెరుగుతాయని బంగారం కొనుక్కొని దాచుకుంటారు. అలా కొనుగోళ్లు పెరిగినప్పుడల్లా ధరలు పెరుగుతాయి. మళ్లీ ఎక్కువ మంది అమ్మినప్పుడు తగ్గుతాయి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. కాబట్టి.. బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయి? ఎప్పుడు తగ్గుతాయి? అన్నది వందశాతం ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. అందుకే.. అమ్మాలన్నా.. కొనాలన్నా.. ఇతరుల సలహాలు తీసుకుంటే తీసుకోండి కానీ.. ఫైనల్ గా నిర్ణయం మీరే తీసుకోండి. ఆ తర్వాత ఎవరిని నిందించినా ఉపయోగం ఉండదు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్