Gold Rate: బంగారం(Gold).. ఆడవాళ్లకు ఇష్టమైనది. భారత దేశంలో ఏటా టన్నుల కొద్దీ బంగారం కొనుగోలు చేస్తున్నారు. అయితే గడిచిన ఐదేళ్లుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ (Trump Tariff Effect)కూడా బంగారంపై పడింది. అయితే అమెరికా విశ్లేషకుడు మాత్రం బంగారం ధర మళ్లీ దిగి వస్తుందని అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు ఇటీవల రికార్డు స్థాయికి చేరినప్పటికీ, రాబోయే కొన్ని సంవత్సరాల్లో భారీగా పతనం కావచ్చని అమెరికా(America)కు చెందిన మార్నింగ్‌స్టార్ విశ్లేషకుడు జాన్ మిల్స్(Jhon mills) అంచనా వేశారు. ఆయన ప్రకారం, ప్రస్తుతం ఔన్సుకు 3,080 డాలర్ల వద్ద ఉన్న బంగారం ధర రాబోయే ఐదేళ్లలో 1,820 డాలర్లకు(సుమారు 38% తగ్గుదల) పడిపోవచ్చు. భారతదేశంలో ఇది 10 గ్రాములకు రూ.90,000 నుంచి రూ.56,000 స్థాయికి చేరే అవకాశం ఉందని సూచిస్తోంది. ఈ అంచనా బంగారం కొనుగోలుదారులకు ఊరటనిచ్చినప్పటికీ, పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ధర పతనానికి కారణాలు
జాన్ మిల్స్ తన అంచనాలో మూడు ప్రధాన కారణాలను పేర్కొన్నారు.
సరఫరా పెరుగుదల: బంగారం ధరలు పెరగడంతో గనుల నుంచి ఉత్పత్తి(Production) గణనీయంగా పెరిగింది. 2024 రెండో త్రైమాసికంలో గనుల సగటు లాభం ఔన్సుకు 950 డాలర్లకు చేరింది, ఇది 2012 తర్వాత అత్యధికం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా(World Gold Counsil Data) ప్రకారం, 2024లో భూమిపై బంగారం నిల్వలు 216,265 టన్నులకు చేరాయి, ఇది ఐదేళ్లలో 9% పెరుగుదల.
రీసైక్లింగ్ పెరుగుదల: రాబోయే సంవత్సరాల్లో బంగారం రీసైక్లింగ్(Re cycling) కూడా పెరుగుతుందని, ఇది సరఫరాను మరింత పెంచుతుందని మిల్స్ చెప్పారు.
డిమాండ్ తగ్గుదల: ఆర్థిక ఆందోళనలు తాత్కాలికమైనవని, దీర్ఘకాలంలో పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గవచ్చని ఆయన హెచ్చరించారు. 2020లో కోవిడ్ సమయంలో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగి, తర్వాత తగ్గిన ఉదాహరణను ఆయన గుర్తు చేశారు.
ఇతర నిపుణుల దృక్కోణం..
మిల్స్ అంచనాకు విరుద్ధంగా, బ్యాంక్ ఆఫ్ అమెరికా రెండేళ్లలో బంగారం ధర ఔన్సుకు 3,500 డాలర్లకు, గోల్డ్‌మన్ సాచ్స్ ఏడాది చివరి నాటికి 3,300 డాలర్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి. ఈ సంస్థలు భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు బంగారం డిమాండ్‌ను పెంచుతాయని భావిస్తున్నాయి.
భారత్‌పై ప్రభావం
భారత్‌లో బంగారం ధరలు డాలర్–రూపాయి మారకం రేటుపై ఆధారపడతాయి. ఒకవేళ రూపాయి బలహీనపడితే, మిల్స్ అంచనా నిజమైనా ధరలు రూ.56,000 కంటే కొంత ఎక్కువగా ఉండవచ్చు. అయితే, ఈ పతనం జరిగితే ఆభరణాల కొనుగోలుదారులకు లాభం చేకూరినా, పెట్టుబడిదారులు నష్టపోవచ్చు.